'ప్రజా సంగ్రామ యాత్ర'.. కమల దళపతి దండయాత్ర..
posted on Aug 13, 2021 @ 12:11PM
కాషాయ 'బండి' వస్తోంది.. కదనోత్సాహంతో వస్తోంది.. ప్రగతిభవన్‌పై దండయాత్రకు 'ప్రజా సంగ్రామ యాత్ర'గా వస్తోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సుదీర్ఘ పాదయాత్రకు పేరు పెట్టేశారు.. ముహూర్తం కూడా నిర్ణయించేశారు.. స్పాట్ సైతం డిసైడ్ చేసేశారు.. ఆగస్టు 24.. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.
పేరులోనే 'సంగ్రామం'.. ఇది సీఎం కేసీఆర్‌పై సంగ్రామం.. గడీల పాలనకు వ్యతిరేకంగా సంగ్రామం.. దొరను గద్దె దింపడానికి జరుగుతున్న సంగ్రామం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజా సంగ్రామ యాత్ర అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. తెలంగాణను కమలం పూదోటగా మార్చేందుకే పాదయాత్ర అని కమలనాథులు అంటున్నారు.
పాదయాత్ర వివిధ దశల్లో జరగనుంది. ముందు హుజురాబాద్ ఎన్నికలే టార్గెట్. అందుకే, తొలిదశలో హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఈటల రాజేందర్ ఇలాకా వరకు.. బండి నడవనుంది. సుమారు రెండు నెలల పాటు తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది.
ఆగస్టు 24న పాదయాత్ర పాతబస్తీ- మెహదీపట్నం మీదుగా షేక్‌పేటకు చేరుకుంటుంది. మరుసటి రోజు గోల్కొండ కోట దగ్గర జరిగే బండి సంజయ్ భారీ సభ నిర్వహించనున్నారు. అనంతరం.. చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట మీదుగా మెదక్ చేరుకుంటారు.
ప్రతిపాదిత రూట్‌మ్యాప్ హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు కొనసాగుతుందని, షెడ్యూల్ విడుదలయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
బండి సంజయ్ పాదయాత్ర విజయవంతానికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లిపోయాయి. పాదయాత్రను విజయవంతం చేసేందుకు 30 నిర్వహణ కమిటీలు ఏర్పాటు కాగా.. అవి వాటి పనుల్లో బిజీగా ఉన్నాయి. బీజేపీ శ్రేణులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాదయాత్ర సక్సెస్‌కు పక్కాగా గ్రౌండ్‌వర్క్ చేస్తున్నాయి.