బీఆర్ఎస్‌తో బాల్క సుమన్‌కు రుణం తీరిపోయిందా?
posted on Aug 6, 2025 @ 10:44AM
గులాబీ పార్టీలో ముఖ్యనేతలకు అత్యంత వీరవిధేయుడు మాజీ ఎంపీ కమ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. పార్టీలోని ముఖ్య నాయకులలో ఒకరిగా ఎదిగిన దళిత, విద్యార్ధి నాయకుడాయన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తన రాజకీయ గురువు, ఆర్ధికంగా ప్రోత్సహించిన గడ్డం వివేక్‌పై పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. తర్వాత తెలంగాణ ముందస్తు ఎన్నికల్ల చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో అప్పటి వరకూ అంత హడవుడి చేసిన సుమన్ ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం, టీఆర్ఎస్వీకి 2007లో అధ్యక్షుడిగా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీకి 2010లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ పై గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలిచారు. తర్వాత బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముందు నుంచి అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్ 2022 జనవరి 26న గులాబీ పార్టీ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా తెగ హడావుడి చేసిన బాల్క సుమన్ దళిత కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే కేటీఆర్ ఆశీస్సులున్నా.. కేసీఆర్ మాత్రం ఆయనకు మంత్రిగా అవకాశమివ్వలేదు.
చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి దళిత కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన సుమన్ ప్రభుత్వ విప్ పదవితో తృప్తి పడాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదంట. గత ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్ కు దమ్ము ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన బాల్క సుమన్ ఓటమి పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట.కేవలం తన అవసరానికి చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు.. ఓడిపోయాక కనీసం ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని బీఆర్ఎస్ వర్గాలే చర్చించుకుంటున్నాయట. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్ కూడా తలో దారి అన్నట్టు అయ్యారట.. చెన్నూరు నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అడపాదడపా వచ్చే నాయకులు తప్ప బీఆర్ఎస్‌కు చెన్నూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకుండా పోయిందట.. ఏదిఏమైనా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళనైనా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో అడుగుపెడతారా? లేక చెన్నూరు నియోజకవర్గంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నారా? వేచి చూడాలి మరి.