అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్, విడుదల!
posted on May 10, 2024 @ 12:49AM
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన అరెస్టు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూన్ 1 వరకు ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆయనను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. జైలు నుంచి కారులో బయటకి వెళ్తూ కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేశారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తీహార్ జైలు వద్దకు వచ్చారు. కేజ్రీవాల్ తన వాహనంలో ఇంటికి బయల్దేరారు. కేజ్రీవాల్ వాహనంలో ఆయన భార్య, కుమార్తె, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ వున్నారు. హనుమాన్ దయ వల్లే తాను బయటకి వచ్చానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తాను హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నానని ఆయన ప్రకటించారు.