పురుషుల పొంగళ్ వేడుక.. ఎక్కడంటే?

ఆలయాల్లో జాతర్లు, తిరునాళ్లు జరిగితే,  మహిళలు పొంగళ్ళు పెట్టడం సాంప్రదాయం. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి కడప జిల్లాలోని ఒక ఆలయంలో వింత ఆచారం అమలులో ఉంది. ఆ ఆలయంలో పురుషులు పొంగళ్లు పెడతారు.   ఔను ఇక్కడి ఆచారం ప్రకారం ప్రతి ఏటా   సంక్రాంతికి ముందు సంజీవరాయ స్వామికి మగవాళ్ళు పొంగళ్ళు పెట్టి మొక్కలు తీర్చుకుంటారు. మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు.

ఆలయంలో పెట్టిన నైవేద్యం కూడా మహిళలు ముట్టుకోరు. మగవాళ్ళేతింటారు.  ఉమ్మడి కడప జిల్లా  పుల్లంపేట మండలం తిప్పారు పల్లెలో ఈ  ఆచారం ఉంది.  ప్రస్తుతం ఈ పుల్లంపేట తిప్పారుపల్లె గ్రామం తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ మగవారి పొంగళ్ల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఆచారం ప్రకారం శ్రీ సంజీవరాయ స్వామికి మగవారే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొంగళ్ళు పెట్టారు. ఈ  పురుషుల  పొంగళ్ల వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  ఏటా సంక్రాంతికి ముందు వచ్చే

ఆదివారం   సంజీవరాయునికి పొంగళ్లు పండుగను   సంక్రాంతి కంటే  ఘనంగా జరుపుకొంటారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. 

చదువు ఒక్కటే పేదిరికాన్ని పోగొడుతుంది : సీఎం రేవంత్‌

  మాదాపూర్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తాము రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.  గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మితే వారికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేదని తెలిపారు. టీజీపీఎస్సీ ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం....యూపీఎస్సీ ని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశామని సీఎం స్ఫష్టం చేశారు. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశామన్నారు.  ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షి గా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశామని ఆయన తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది.. పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని.. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని చెప్పారు. 10 ఏళ్ల‌లో రెండు సార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదని విమర్శించారు. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది.. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలని సీఎం రేవంత్ తెలిపారు.

మంగళగిరి ప్రీమియర్ లీగ్‌లో సందడి చేసిన మంత్రి లోకేష్

  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో  నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ పోటీల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ముందుగా బోగి ఎస్టేట్స్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ ఆఖరి మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ టాస్ వేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. వల్లభనేని వెంకట్రావ్ యూత్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ను ఎంచుకుంది. అనంతరం ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ను మంత్రి లోకేష్ వీక్షించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య,  ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.

లక్కుండిలో లంకె బిందెలు...నిధి కోసం ప్రభుత్వ వేట

  కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే. 634 గ్రాముల బరువున్న ఆ తామరపు బిందెలో 466 గ్రామలు బంగారు గాజులు, కడియాలు, గొలుసు, ఉంగరాలు బయటపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో నిధి కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం (16-1-26) నుంచి లక్కుండిలో నిధి కోసం వేట మొదలుపెట్టారు.  అక్కడి కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిధుల కోసం పుర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రాక్కులు, ట్రాక్టర్‌లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్‌మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి.  పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణాలు ముద్రించినట్లు అధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతం 14వ శతాబ్దంలో ప్రధాన నగరంలో ఉండేదని చారిత్రక ఆధారులున్నాయి. భుగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాడి ఉండొచ్చని, వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్కుండిలో లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు.

అంధ రచయిత్రి రాసిన నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

  మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో కుటుంబంతో సహా సాయిజ్యోతి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అంధురాలైన సాయిజ్యోతి మొబైల్ లో వాయిస్ ఇన్ పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రచనలు చేస్తున్నారు.  ‘చైత్రశ్రీ’ కలం పేరుతో కవితాంజలి అనే కవితా సంపుటితో పాటు ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ అనే నవలలు, సామాజిక స్పృహ కలిగించే కథలు రచించారు. నూతక్కి హైస్కూల్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తున్నారు. వైకల్యాన్ని జయించి తన ప్రతిభతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన సాయిజ్యోతిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బీహార్‌లో ట్ర‌క్కు ఢీకొని బాలుడు మృతి…మానవత్వం మరిచిన జనం

  బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతే… మరోవైపు అదే ప్రమాదానికి కారణమైన ట్రక్కు నుంచి కింద పడిన చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని పట్టించుకోకుండా చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజిహాట్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రితేష్ కుమార్ ఉదయం సైకిల్‌పై కోచింగ్ క్లాస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. అందులో ఉన్న చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెలవిసేలా రోదిస్తుంటే… మరోవైపు కొందరు స్థానికులు మాత్రం ఆ దృశ్యాన్ని పట్టించుకోకుండా చేపలను తీసుకెళ్లడంలో మునిగిపోయారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మానవత్వం ఎక్కడ పోయింది?” అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలుడి మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   https://publish.twitter.com/?url=https://twitter.com/SomuAnand_/status/2012079958672458099#

యాంకర్ అనసూయ ఫిర్యాదు... 42 మందిపై కేసు

  ప్రముఖ యాంకర్, సినీ నటి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై క్రిమినల్ డిఫమేషన్, సెక్సువల్ హెరాస్‌మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  తనను లక్ష్యంగా చేసుకుని అశ్లీల వ్యాఖ్యలు చేయడం, లైంగిక దూషణలకు పాల్ప డటం, బెదిరింపులు పంపడం వంటి చర్యలు జరుగుతు న్నాయని ఆమె ఆరోపిం చారు. కొందరు కావాలనే క్యాంపెయిన్ తరహాలో తనపై దాడి చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతే తనపై ఈవిధంగా ట్రోలింగ్ మొద లైందని అనసూయ తెలి పారు.  తాను చేసిన వ్యాఖ్య లను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారని అనసూయ తన  ఫిర్యాదులో పేర్కొ న్నారు. కొందరు ఏఐ సాంకే తికతను ఉపయోగించి మార్ఫింగ్, ఫోర్జరీ కంటెంట్ సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు.బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని వీరితోపాటు మరికొందరిపై అనసూయ ఫిర్యాదు చేసింది.  అంతేకా కుండా నిందితుల పేర్లతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాల లింకులను కూడా అనసూయ తన ఫిర్యాదుతో జత చేసి పోలీసులకు సమర్పించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని తో సహా మొత్తం 42 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవస రమైతే నిందితులను అదుపులోకి తీసుకుం టామని తెలిపారు. ప్రస్తుతం నిందితుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు, పోస్టులు, వీడియోలను సేకరించి సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నా : సీఎం రేవంత్

  ఆదిలాబాద్‌ జిల్లా భోరాజ్‌ మండలం హతిఘాట్‌లో చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ “ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమాని పేర్కొన్నారు.  జల్ జంగల్ జమీన్ అని నినదించిన పోరాటాల గడ్డ ఇది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తానని చెప్పాని సీఎం వెల్లడించారు.  జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో సాగేదని అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టుల పూర్తి కోసం కృషి చేస్తున్నామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. చనాక- కొరటాకు సీ. రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని రేవంత్ తెలిపారు. ప్రజలకు సేవలందించిన ఆ ఇద్దరి పేర్లు రెండు ప్రాజెక్టులకు పెట్టాలని అధికారులకు సూచన చేస్తున్నాని తెలిపారు.  తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని, అక్కడే ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం తీసుకొచ్చే పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసినట్లే ఆదిలాబాద్‌కూ ఇస్తామని కేంద్రం చెప్పిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అడిగితేనే అభివృద్ధి వస్తుందని, గత పాలకులు అడగకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వారి పాలన వల్ల అప్పులు మిగిలాయని, నాడు ఇచ్చిన బియ్యం ఎవరు తిన్నారో తెలియదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ప్రజలు తింటున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ధి చేసే వారినే గెలిపించుకోండని రేవంత్ స్పష్టం చేశారు

తిరుపతిలో ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్.. చంద్రబాబు

యువతరం భవిష్యత్  బంగారంగా ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఆ దిశగా అన్ని విధాలుగా యువత భవిష్యత్ ను తీర్చిదిద్దేలా అవసరమైన చర్యలు తీసుకునేలా విధానాల రూపకల్పన జరగాలని చంద్రబాబు ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  భవిష్యత్తులో ఏయే రంగాల్లో యువతకు మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయో గుర్తించడంతో పాటు,  .ఆయా రంగాల్లో యువతలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం (జనవరి 16) ఏరో స్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయనీ,  ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్, సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వివరించారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు...వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా వచ్చే కంపెనీలకు... పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనీ, ఆ దిశగా చర్యలు, విధానాల రూపకల్పనలు జరగాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ఇందుకురాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతిలో  ఓ అతి పెద్ద అధ్యయన కేంద్రాన్ని తిరుపతిలో ఏపీఫస్ట్ పేరిట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్‌ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీఫస్ట్ ఏర్పాటు కాబోతోందన్న ఆయన దీనిని  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిది ద్దాలన్నారు.  ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదిం పులు జరపాలని చంద్రబాబు సూచించారు.     నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు...యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందనీ,  సంక్షేమానికి-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తోందో,  యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. దీంట్లో భాగంగానే ఏపీ ఫస్ట్   ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యూనివర్శిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకుని,  ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యార్థులు చేస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలను అంది పుచ్చుకోవాలన్నారు.  అలాగే యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలన్నారు. అదే విధంగా   అందుబాటులోకి వస్తోన్న టెక్నాలజీలు ఏంటీ...? ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనే విషయాలను గుర్తించి.. వాటిని కరిక్యులమ్‌లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ ప్రిపేర్ చేసేలా ఏపీ ఫస్ట్ పని చేయాలని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నాయి. ఇదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలనీ, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందనీ చెప్పారు.  వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.  అలాగే.. డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలనీ, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందనిచెప్పారు. ఇటువంటి ఫ్యూచర్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ఈ  సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మేడిపల్లిలో పండగ దొంగల బీభత్సం...12 ఇళ్లలో చోరీ

  వీళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు కాదురా బాబోయ్ దర్జాగా కార్లో వస్తారు... మెల్లిగా ఎటువంటి అలజడి లేకుండా పని మొత్తం ముగించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ కోసం పోలీసులు వేట కొనసాగించారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది తమ స్వగ్రామా లకు వెళుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలోనే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకో వాలంటూ పలు సూచనలు చేశారు. కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా సంతోషంతో స్వగ్రామాలకు వెళుతూ ఉంటారు. కానీ ఇదే అవకాశం గా భావించే దొంగలు రెచ్చిపోతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.  మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదండోయ్...  అర్ధరాత్రి సమయంలో ఒక్కరు కాలనీలోకి వచ్చి ఆగింది. కార్లో నుండి చాలామంది యువకులు బయటకు వచ్చారు. చేతిలో కత్తులు పట్టుకుని కాలనీలో సంచరిస్తూ వరుసగా 12 ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి... అనంతరం అర్ధరాత్రి సమయంలో కారులో దర్జాగా వచ్చి చోరీలు చేసి, అనంతరం వేగంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు.  సంక్రాంతి పండగ కారణంగా చాలా కుటుంబాలు వారి తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లిపోయారు. అలాంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకున్న దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. కొందరు ఇళ్లలో అల్మారాలు, డ్రాయర్లు చెల్లాచెదురుగా పడివుం డటం చూసి ఉదయం చోరీ జరిగిన విషయం బయట పడింది. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే బాధితులు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అయితే కారులో వచ్చి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో  రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌ను రప్పించారు.  ఫింగర్ ప్రింట్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దొంగల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో మొహానికి మాస్క్ , మరియు చేతిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్న దొంగలను చూసిన స్థానికులు  భయాం దోళనకు గురవుతున్నారు. పండగ రోజుల్లో గస్తీ పెంచాలని, రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ సులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.