ఆటోని ఢీకొన్న రైలు... 20 మంది మృతి
posted on Aug 19, 2014 8:32AM
బీహార్‌లో దారుణం జరిగింది. మెదక్ జిల్లా మాసాయిపేట తరహా ఘోర ప్రమాదం జరిగింది. రాప్తి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోరిక్షా రైల్వే గేట్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా చినౌతా గ్రామానికి చెందిన వారు. ఓ ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. గేట్ మెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ జరపనుంది. ఆటోని ఢీకొన్న రైలు సుమారు 50 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకుపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయి. బీహార్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం తెలిపారు.