ఆర్యవైశ్యులంటే వైసీపీకి ఎందుకంత మంట? జగన్‌పై గుప్తాల కన్నెర్ర..
posted on Dec 21, 2021 @ 2:07PM
రెండు ఘటనలు. నెల రోజుల గ్యాప్‌లోనే వరుస అవమానాలు. ఓ వర్గం మొత్తానికి దారుణ అవమానం. ఆర్యవైశ్యులంటే జగన్‌కు ఎందుకంత చులకన? గుప్తాలంటే వైసీసీ వారికి ఎందుకంత గుర్రు? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కురువృద్దుడు, పార్టీలకు అతీతంగా అంతా గౌరవించే మాజీ సీఎం రోశయ్య పార్థీవ దేహాన్ని సీఎం జగన్ కనీసం సందర్శించకపోవడంపై వైశ్యులంతా చాలా కోపంగా ఉన్నారు. ఆ ఆగ్రహజ్వాలను మరింత రాజేసేలా.. తాజాగా ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై సొంతపార్టీ నేతలే దాడి చేయడం.. మోకాలిపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించడం.. ఆ దృశ్యాలన్నీ వీడియో రికార్డ్ చేసి వైరల్ చేసి అవమానించడం.. ఇలా ఈ రెండు ఘటనలతో ఆర్యవైశ్యులంతా అధికార పార్టీ తీరుపై రగిలిపోతున్నారు.
రోశయ్య మరణం తర్వాత జగన్ తీరును తప్పుబడుతూ.. అప్పుడు ఓ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్.. తమ జాతి గుండెలపై తన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగునేలకు రోశయ్య చేసిన సేవకు కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా.. ఆయన చనిపోతే కనీసం చివరిచూపు కూడా చూడకుండా.. జగన్.. తమ జాతి రత్నాన్ని అవమానించారని మండిపడ్డారు. తాజాగా, సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుల దాడిపైనా వైశ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఆర్యవైశ్య సంఘం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆర్యవైశ్యులకు మంత్రి కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక, గుంటూరులో జనసేన నేత నేరేళ్ల సురేశ్ మరింత ఘాటుగా నిలదీశారు. వైశ్యులపై దాడులు జరుగుతుంటే.. పదవులు పొందిన ఆర్యవైశ్య నేతలు ఎందుకు పెదవి విప్పటం లేదని ప్రశ్నించారు.
ఇలా, ప్రాంతాలు, జిల్లాలకు అతీతంగా ఆర్యవైశ్యులంతా వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ అంతటివాడే రోశయ్యను అవమానించడంతో.. మిగతా నేతలూ జగన్ అడుగుజాడల్లోనే గుప్తాలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడుతున్నారు. వైశ్యులు సౌమ్యులు కాబట్టే.. వ్యాపారంతో వాళ్ల పనేదో వాళ్లు చూసుకుంటారు.. ఎదురుదాడి చేయరనే ధీమాతోనే.. ఆ వర్గం టార్గెట్‌గా ఇలా చేస్తున్నారంటూ తప్పుబడుతున్నారు. రోశయ్య చనిపోతే జగన్ వెళ్లకపోవడమే ఓ తప్ప అయితే.. టార్గెట్ చేసి, వెంటాడి మరీ సుబ్బారావు గుప్తాపై దాడి చేయడం.. తమ జాతిపై చేసిన దాడిగానే పరిగణిస్తున్నారు ఆర్యవైశ్యులు. అందుకే, ఆ వర్గమంతా ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా ఏకమవుతోంది. రోశయ్యనే సరిగ్గా గౌరవించలేని పార్టీ.. ఇక తమకేమాత్రం ప్రాధాన్యత ఇవ్వదనే విషయం గుర్తించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆర్యవైశ్యులంతా జట్టు కడుతున్నారు. తమ రాజకీయ ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.