హర్షకుమార్ అరెస్ట్ కు వారెంట్ జారీ
posted on Mar 20, 2013 8:00AM
2004 ఎన్నికల్లో మలాపురం నుంచి ఎం.పి.గా పోటీ చేసిన హర్షకుమార్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా నగరంలో కొంతమంది ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు హర్షకుమార్ కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభ వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేయగా హర్షకుమార్ విచ్చేసి సభా వేదికపై ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమ జరుగుతుండగా కృష్ణస్వరూప్ అనే విద్యార్థికి హర్షకుమార్ మద్దతుదారులకు మధ్య గొడవ జరిగింది. హర్షకుమార్ సహా సభా వేదికపై వున్న పలువురు తనపై దాడిచేశారని కృష్ణస్వరూప్ కేసు దాఖలు చేశారు. మంగళవారం నాటి విచారణకు హర్షకుమార్ గైరుహాజరయ్యారు. దీంతో విశాఖపట్నం నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ న్యాయమూర్తి హర్షకుమార్ పై అరెస్టు వారెంట్ జారీచేసి కేసును ఏప్రిల్ 10కి వాయిదా వేశారు.