వార్నింగ్ కాదు విషెష్.. సజ్జలపై సంఘాల రివర్స్ ప్రెస్‌మీట్..
posted on Oct 9, 2021 @ 12:45PM
ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఇరకాటంలో పడ్డారు. సమస్యలపై పోరాడితే సర్కారుకు ఆగ్రహం.. అలాగని మౌనంగా ఉంటే ఉద్యోగులకు సంకటం. ఇలా వారి పరిస్థితి ఇరకాటంలో పడింది. అందుకే, వార్నింగ్ ఇచ్చిన వారినే.. విషెష్ చెప్పారంటూ చెప్పక తప్పని దుస్థితి. ఎవరి వల్ల ఇబ్బందులో.. వారినే పొగుడుతూ ప్రెస్‌మీట్లు పెట్టాల్సిన దౌర్భాగ్యం. నాయకత్వ పరిణితి లేని ఉద్యోగ సంఘ నాయకుల వల్ల.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు. సంఘం నేతలపై ఉద్యోగులు కన్నెర్ర జేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
మూడురోజుల కిందట ఉద్యోగ సంఘం నేతలు విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సమయానికి జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని.. పీఆర్సీ అమలు చేయాలని.. పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని.. ఇలా వారి కష్టాలన్నీ మీడియా ముఖంగా ఏకరువు పెట్టారు. ప్రభుత్వ తీరు మారకపోతే.. పోరాటం తప్పదనీ హెచ్చరించారు. అయితే, ఆ ప్రెస్‌మీట్‌కు ముందు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అదిప్పుడు మరో ప్రెస్‌మీట్‌కు కారణమైంది. అప్పుడు ఆగ్రహం కాస్త ఇప్పుడు సంజాయిషీగా రూపు మారడం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఇటీవలి ప్రెస్‌మీట్‌కు ముందు ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. మీడియా మైక్‌లన్నీ ఆన్‌లో ఉండటంతో బండి శ్రీనివాసరావు.. సజ్జలతో ఫోన్‌లో మాట్లాడారు. "కంట్రోల్‌లోనే ఉంటాం సార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం సార్" అంటూ సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతలు బెదురు బెదురుగా మాట్లాడటం మీడియాలో రికార్డ్ అయింది. బండి శ్రీనివాసరావు రియాక్షన్‌ను బట్టి.. అటునుంచి ఫోన్లో సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరిస్తున్నట్టు ఈజీగా తెలిసిపోతోంది. కంట్రోల్‌లోనే ఉంటాం సార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం సార్.. అంటే మీనింగ్ ఏంటి? కంట్రోల్‌లో ఉండాలని సజ్జల హెచ్చరించినట్టేగా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడ వద్దని ఉద్యోగ సంఘాల నేతలను సజ్జల బెదిరించినట్టేగా? ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సజ్జల వార్నింగ్‌పై రచ్చ నడుస్తోంది. దీంతో.. సజ్జలను వెనకేసుకొచ్చేందుకు తాజాగా మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఆ ప్రెస్‌మీట్‌లో వాళ్ల వివరణ వింటే.. ప్రభుత్వం బలవంతం మీదే వారంతా మరోసారి మీడియా ముందుకు వచ్చి.. సర్కారును వెనకేసుకు వచ్చారని ఇట్టే అర్థమైపోతుంది.
సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు కానీ తమను బెదిరించలేదని.. శుభాకాంక్షలు చెప్పారని ఏపీ ఎన్జీవో నేతలు చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ఉండొద్దని సజ్జల అన్నారట. సెక్రటేరియట్‌లో తమ సమస్యలు చెప్పుకోవడానికి జీతాలు, పెన్షన్లు రాలేదని అడగడానికి సెక్రటేరియట్‌లో ఎవరూ ఉండరని.. తమకు ఒక్క సజ్జల మాత్రమే అందుబాటులో ఉంటారని.. తెగ వెనకేసుకొచ్చారు. అయినా.. ఉద్యోగుల సమస్యలు వినడానికి సజ్జల ఎవరు? ఆయన కేవలం ప్రభుత్వ సలహాదారు మాత్రమే కదా? అనే అనుమానం రాకమానదు..అది వేరే విషయం. ఇక, తాజా ప్రెస్‌మీట్‌లోనూ ఏపీ ఎన్జీవో నేతల కళ్లల్లో, మాటల్లో.. ప్రభుత్వంపై భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. సజ్జల బెదిరించలేదు, శుభాకాంక్షలు చెప్పారని వారెంత నమ్మించే ప్రయత్నం చేసినా.. సజ్జల ఒత్తిడితోనే ఉద్యోగ సంఘాల నేతలు ఈ మీడియా సమావేశం పెట్టారని.. ఇలాగైతే వీళ్లు ఉద్యోగ సమస్యలపై సర్కారుపై ఇంకేం పోరాటం చేస్తారని ఏపీ ఉద్యోగులు తమ నేతల తీరుపై మండిపడుతున్నారు.