ఏపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు! సచివాలయంలో చర్చ
posted on Mar 27, 2021 @ 4:06PM
ఎక్కడైనా రాష్ట్రానికి ఒకరే ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంలు మాత్రం ఎంతమందైనా ఉండొచ్చు.. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రికి అదనంగా పవర్ ఉండదు. సామాజిక సమీకరణల కోసం అలా నియమిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో డిప్యూటి ముఖ్యమంత్రి పదవులను పెంచేస్తున్నారు పాలకులు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్త చర్చ సాగుతోంది. ఏపీలో అధికారికంగా ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నా.. అనధికారికంగా ముగ్గురు ముఖ్యమంత్రులున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకరేమో రాజకీయ ముఖ్యమంత్రి, మరొకరు అధికారులకు ముఖ్యమంత్రి, ఇంకొకరేమో సచివాలయ అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి అట.
సిఎంవో కార్యాలయ ఇంఛార్జి అధికారి ప్రవీణ్ ప్రకాష్‍ను తమ ముఖ్యమంత్రిగా ఐఎఎస్ అధికారులు చెప్పుకుంటున్నారట. ఐఏఎస్ లకు సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదట. ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా.. వీలు కాకపోవడంతో వారంతా ఇక ఆ ప్రయత్నాలే చేయడం మానుకున్నారట. సీఎంవో ఇంచార్జ్ ప్రవీణ్ ప్రకాష్‍ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారట. తమ శాఖపరమైన అంశాలను కూడా ఆయనతోనే చర్చిస్తున్నారట. ప్రవీణ్ ప్రకాశ్ ను కలిస్తే ముఖ్యమంత్రిని కలిసినట్టేనన్న భావనలో ఐఏఎస్ లు ఉన్నారంటున్నారు. అందుకే ఐఏఎస్ లకు ప్రవీణ్ ప్రకాషే ముఖ్యమంత్రి అన్న చర్చ సచివాలయంలో జరుగుతోంది.
సచివాలయ అధికారులు, ఉద్యోగులకు... సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి అని పలువురు చెబుతున్నారు. సచివాలయంలో బదిలీలు, పోస్టింగ్‍లన్నీ వెంకటరామిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ప్రాధాన్యత కీలక శాఖలలో పోస్టులు కావాలన్నా ఎవరినైనా బదిలీ చేయాలన్నా వెంకటరామిరెడ్డిని స్వయంగా కలిస్తే.. ఆగమేఘాలపై బదిలీలు జరుగుతాయట. పోస్టింగ్‍లు కూడా ఇస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.వెంకటరామిరెడ్డికి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయంటున్నారు. అందుకే సచివాలయంలో ఆయన సూపర్ బాస్ లో మారారనే చర్చ సాగుతోంది.
అనధికారిక ముఖ్యమంత్రులుగా ప్రచారం జరుగుతున్న ప్రవీణ్ ప్రకాష్, వెంకటరామిరెడ్డిలు ముఖ్యమంత్రి జగన్‍రెడ్డికి అత్యంత సన్నిహితులే. అందుకే ప్రవీణ్ ప్రకాష్, వెంకటరామిరెడ్డిని కలిస్తే.. పనులు చక్కపెట్టుకోవచ్చని ఐఎఎస్ అధికారులతో పాటు సచివాలయ క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు నమ్ముతున్నారట. ఈ విషయాలన్నీ అసలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ సచివాలయంలో కొసరు ముఖ్యమంత్రి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని టాక్. ఈ విషయాలు త్వరలో సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్దమవుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో బాగా పరిచయం ఉన్న అధికారులు అసలు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాల సమాచారం. సచివాలయంలో జరుగుతున్న బాగోతంపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..