మండలిని రద్దు చేస్తే పిల్లి, మోపిదేవి పరిస్థితేంటి?
posted on Dec 19, 2019 @ 1:10PM
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించగా, శాసనమండలిలో మాత్రం చుక్కెదురైంది. సంఖ్యాపరంగా బలంగా ఉన్న టీడీపీ రెండు బిల్లులకు అభ్యంతరాలు చెప్పింది. బిల్లుల్లో సవరణలు కోరుతూ తీర్మానంచేసి శాసనసభకు తిప్పిపంపారు. అయితే, ఆ సమయంలో మండలిలో ఉన్న మంత్రులు... ఇలా చేస్తే మండలినే రద్దు చేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, బిల్లులు ఆమోదం పొందకుండా తెలుగుదేశం అడ్డుపడటంతో సీఎం జగన్మో హన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు.
అయితే, జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు శాసనమండలి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఒకవేళ శాసన మండలిని రద్దు చేస్తే, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులు కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ అదే జరిగితే వీళ్లిద్దరినీ ఎలా అకామిడేట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, మండలిని రద్దుచేస్తే... ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు నామినేటెడ్ పదవులిచ్చి కేబినెట్ హోదా కల్పించవచ్చని అంటున్నారు.
ఇప్పుడు జగన్ కు ఎదురైన పరిస్థితే 1985లో ఎన్టీఆర్ కి ఎదురైంది. ఆనాడు బంపర్ మెజారిటీతో గెలిచి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్టీఆర్ కి... శాసనమండలిలో కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా మారింది. దాంతో, మండలిని రద్దు చేయాలంటూ కేంద్రానికి తీర్మానం పంపి సాధించుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఒకవేళ మండలి రద్దే జరిగితే...టీడీపీకి మాత్రం బిగ్ షాకే.