చనిపోయిన HMకి కొవిడ్ డ్యూటీ.. జగన్ సర్కార్ నిర్వాకం
posted on May 13, 2021 @ 3:01PM
కొవిడ్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా రోగులకు సరైన చికిత్స కూడా అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజయనగరం, హిందూపురం, తిరుపతి రుయా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం కలకలం రేపింది. అయినా ఏపీ అధికారులు నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. ఉన్నతాధికారులు ఏం చెప్తే అది గుడ్డిగా చేసేస్తున్నారు. ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి కోవిడ్ విధులు వేయడం వివాదాస్పదం అవుతుండగా... కొందరు అధికారుల తీరు మరీ ఘోరంగా ఉంటోంది.
చనిపోయిన టీచర్ కు కొవిడ్ డ్యూటీ వేసిన అధికారులు.., విధులకు రాలేదన్న పేరుతో మెమో కూడా జారీ చేశారు. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో టీచర్లకు కొవిడ్ డ్యూటీలు వేశారు. నిత్యం వందలాది మంది టీచర్లకు కోవిడ్ విధులు కేటాయిస్తున్నారు. అందులో కొందరు హాజరవుతుండగా.. మరికొందరు రావడం లేదు. దీంతో ఉన్నతాధికారులు వారికి మెమోలు జారీ చేస్తున్నారు.
రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుడిగా విజయభాస్కర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. కరోనాతో పోరాడిన ఆయన.. మే 7వ మృతి చెందారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 పై అవగాహన కల్పించాలని విజయభాస్కర్ రెడ్డికి ఈనెల 9న డ్యూటీ వేశారు. డ్యూటీ ఛార్ట్ వేసే ముందు మనిషి ఉన్నారా లేదా..? అనే సమాచారం సేకరించకుండానే విధులు కేటాయించారు. అంతేకాదు ఆయన డ్యూటీకి రాలేదంటూ.., రొద్దం తహసీల్దార్ సురేష్ కుమార్ ఈనెల 11వ తేదీ చార్జ్ మెమో జారీ చేశారు. చనిపోయిన వ్యక్తికీ డ్యూటీలు వేసి...ఆపై మెమో జారీ చేయడం చూసి అంతా షాకయ్యారు.
అనంతపురం జిల్లాలో వందలాది మంది టీచర్లకు కొవిడ్ డ్యూటీ వేశారు. కొవిడ్ బాధితులకు అవగాహన కల్పించేందుకు టీచర్లతోపాటు గ్రామస్థాయి కమిటీలను నియమించారు. సర్కార్ తీరుపై ఉపాధ్యాయులు,సంఘాల నాయకులు, ఎమ్మెల్సీల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెనుకొండలో ఇటీవల విధులను టీచర్లు బహిష్కరించారు. తమకు వ్యాక్సిన్లు వేయకుండా, ఎలాంటి ముందస్తు భరోసా కల్పించకుండా తాము డ్యూటీలకు ఎలా హాజరు అవుతామంటూ మండిపడుతున్నారు. పైగా డ్యూటీకి రాలేదంటూ మెమోలుజారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. భౌతికంగా పాజిటివ్ వ్యక్తుల వద్దకు వెళితే.. మరికొందరు టీచర్లు కరోనా సోకి మృత్యువాతపడే ప్రమాదం ఉందంటున్నారు టీచర్లు.