రాత్రి పోస్టింగ్.. ఉదయానికి క్యాన్సిల్! ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్
posted on Feb 19, 2021 @ 2:17PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ అధికారుల బదిలీలు.. అంతలోనే మళ్లీ మార్పులు.. రాత్రికి రాత్రే జీవోలు వస్తుండటం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రికి నచ్చకపోతే వెంటనే బదిలీ చేయడం, ఆయనను ప్రసన్నం చేసుకుంటే తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవడం అధికారులకు పరిపాటిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ ఐఎఎస్ అధికారి పూనం మాలకొండయ్య వ్యవహారంలో జరిగిన పరిణామాలతో ఇది నిజమైందంటున్నారు.
సీనియర్ ఐఎఎస్ అధికారి పూనం మాలకొండయ్యపై ఆధారాలతో సిబిసిఐడి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రేపో మాపో పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి జగన్‍రెడ్డి చర్య తీసుకోవటం ఖాయమని సీనియర్ అధికారులు భావించారు. అయితే తాజాగా సీన్ మారిపోయింది. పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోరని స్పష్టం అవుతోందంటున్నారు అధికారులు.
పూనం మాలకొండయ్య అదనంగా నిర్వహిస్తున్న పశుసంవర్దక శాఖ నుంచి ఆమెను తప్పించింది జగన్ సర్కార్. ఆ పోస్టులో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఐఎఎస్ అధికారి నరేష్ శ్రీనివాస్‍ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కాపు కార్పోరేషన్ ఎండీగా ఎవరికి బాధ్యతలు అప్పజెప్పాలన్న విషయం ఆ శాఖాదిపతికే సూచిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. పూనం నుంచి తప్పించిన శాఖను తిరిగి ఆమె అప్పగిస్తూ తెల్లవారగానే మరో ఉత్తర్వు వచ్చేసింది. అంతకు ముందు నరేష్ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్న కాపు కార్పోరేషన్ ఎండీగానే ఆయనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే ఉత్తర్వులు మారిపోయాయంటే.. పూనం మాలకొండయ్యకు జగన్ రెడ్డి వద్ద ఎంత పలుకుబడి ఉందో స్పష్టం అవుతోందంటున్నారు అధికారులు.
కార్యదర్శి హోదాలో ఉన్న నరేష్ శ్రీనివాస్‍కు ముఖ్యకార్యదర్శి హోదా ఇవ్వటమే కాకుండా ఆయనకు చాలా రోజులు ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తాజాగా ముఖ్యకార్యదర్శి హోదాను నరేష్‍కు ఇస్తూ… ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అయితే పశుసంవర్దక శాఖాదిపతిగా నియమించిన ఉత్తర్వులను నిలిపివేసి ఆయనను మళ్లీ కాపు కార్పోరేషన్ ఎండీగా యధావిధిగా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముఖ్య కార్యదర్శి హోదా వచ్చిందని సంతోషపడాలో లేక పశుసంవర్దకశాఖాదిపతిగా నియమించిన ఉత్తర్వులను రద్దు చేసిన దానికి బాధ పడాలో తెలియని పరిస్థితిలో నరేష్ శ్రీనివాస్ ఉన్నారనే చర్చ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జోరుగా జరుగుతోంది.