ఇప్పటికి కళ్లు తెరిచిన ఏపీ సర్కార్
posted on Sep 24, 2015 @ 5:12PM
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడంలా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు. రాష్ట్రం విడిపోయి ఏపీ ఆర్ధిక లోటుతో ఉన్న ముఖ్యమంత్రి కానీ... ఇతర నేతలు.. అధికారులు కానీ ఖర్చుచేయడంలో ఏమాత్రం తగ్గరు. ఏవైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం.. ముఖ్యంగా విమాన ప్రయాణాలు.. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కళ్లు తెరిచినట్టుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి.. ఏపీ పాలన చేయడం కష్టమని భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ శాతం అక్కడే ఉంటున్నారు. అయితే హైదరాబాద్ ఉన్న అధికారులు చంద్రబాబును కలవడం.. ఇక్కడ ఎమన్నా సమావేశాలు.. సమీక్షలు ఉన్నా తరచూ ఇక్కడికి రావడంతో రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కువ విమాన ప్రయాణం చేయడంతో వాళ్లిచ్చే బిల్లులతో ప్రభుత్వానికి తడిసి మోపెడవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఓ కండీషన్ పెట్టింది. హైదరాబాద్ నుండి విజయవాడకు విమాన ప్రయాణం చేయాలంటే రానుపోనూ కలిపి రూ. 10వేల రూపాయలు మించకూడదని.. అలాకాకపోతే కారులో ప్రయాణించాలని సూచించింది. అంతేకాదు ఒక్కసీఎం.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి తప్ప ఇంకా ఏ ఉన్నతాధికారి తమ వెంట సిబ్బందికి తెచ్చుకోవద్దని.. అందునా స్టార్ హోటళ్లలో కాకుండా టూరిజం హోటళ్లలో బస చేయాలని ఆదేశించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఇన్ని రోజులకు కళ్లు తెరిచి పొదుపు బాట పట్టినట్టుంది. ఈ పని ఎప్పుడో చేసుంటే ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయలు మిగిలేవి.