ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు
posted on Mar 2, 2023 @ 11:39PM
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించడం. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ శుక్రవారం (మార్చి 3) నుంచి రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరగనుంది. దీని కోసం జగన్ సర్కార్ ప్రచారార్భాటాలతో ఊదరగొట్టేస్తోంది. నిజానికి ఈ సమ్మిట్ తో ఏం ఒరుగుతుందన్న ప్రశ్న పరిశ్రమల వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా వినిపిస్తోంది.
ఎందుకంటే.. గత నాలుగేళ్లుగా ఏపీ పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. కొత్త పరిశ్రమలు రావడం అటుంచి ఉన్న పరిశ్రములు ఏపీని దాటి వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్లు వచ్చి పడతాయని చెబుతూ ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ముసుగులో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని సర్కార్ ఖర్చు పెట్టేస్తున్నది. దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారని ఊదరగొడుతూ సదస్సుపై హైప్ పెంచేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నది. అయితే రాష్ట్రంలో వాస్తవంగా పారిశ్రామిక వేత్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు. పాలకపక్ష నేతలు పారిశ్రామికవేత్తలను నానా రకాలుగా వేధిస్తున్నారు. వారి వేధింపుల కారణంగానే కొత్త పరిశ్రమలేవీ ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి రాలేదు. మరో వైపు ఉన్న పరిశ్రమలే పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒ
క విధంగా చెప్పాలంటే జగన్ సర్కార్ అంటే పారిశ్రామిక వేత్తలు భయంతో పారిపోతున్నారు. తెలుగుదేశం హయాంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. అప్పట్లో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అందించడంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన గుర్తింపును ఈ ప్రభుత్వం పూర్తిగా పోగొట్టేసింది. అమర్నాథ్ రెడ్డి చెప్పిన కోడి గుడ్డు కథలా రాష్ట్ర పారిశ్రామిక విధానం తయారైంది.
గతేడాది పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీలు ఇప్పటికీ చెల్లించిన దాఖరాలు లేవు. 2020లో రాష్ట్రంలో కొత్తగా 1200 కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదుకాగా.. అందులో సగం కంపెనీలు స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్ ను రద్దుచేసుకున్నాయి. గత ఏడాది దావోస్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏపీ నుంచి ప్రాతినిథ్యమే లేదు. ఎందుకంటే అక్కడ చలి అధికం అని ఘనత వహించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి చెప్పారు.
అంతకు ముందు ఏడాది దావోస్ కు భారీ ప్రతినిథి బృందంతో వెళ్లిన సీఎం జగన్ రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఘనంగా ప్రకటించారు. అయితే దావోస్ లో జగన్ కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ.. భారత పారిశ్రామిక వేత్తలతోనే.. ఇంతోటి దానికి దావోస్ వరకూ వెళ్లడమెందుకన్న విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. ఇంతా చేసి దావోస్ లో జగన్ కుదుర్చుకున్న ఎంవోయిలతో ఇప్పటికీ ఒక్కటి కూడా గ్రౌండ్ అయిన దాఖలాలు లేవు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా జగన్ ప్రభుత్వం ఇంత ఆర్భాటంగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ అంటూ జనాలను పెట్టుబడులు వస్తాయన్న భ్రమల్లో ముంచాలని ప్రయత్నిస్తున్నది.