షర్మిల వెంట విజయమ్మ, వివేకా ఫ్యామిలీ.. జగన్ ఒంటరివాడయ్యారా..?
posted on Jul 8, 2021 @ 10:24AM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు ముదిరిపోయాయా? ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీలో ఒంటరివాడయ్యారా? తల్లి కూడా జగన్ ను దూరం పెట్టిందా? వైఎస్సార్ కుటుంబానికి సంబంధించి కొన్ని రోజులగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఏదో జరుగుతుందనే అనుమానాలు వచ్చేలానే కనిపిస్తున్నాయి. జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం, జగన్ ప్రస్తావన లేకుండానే తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు విజయమ్మ కూడా షర్మిల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉంటుండగా.. విజయమ్మ మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నారు. షర్మిల వెంటే ఉంటున్నారు. దీంతో వైఎస్ కుటుంబంలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కుటుంబంలో విభేదాలపై జరుగుతున్న ప్రచారానికి వైఎస్ జయంతి కార్యక్రమాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. వైఎస్సార్ జయంతి రోజున తెలంగాణలో పార్టీని ప్రకటించనున్న షర్మిల.. ఇడుపులపాయలోని తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జెండాను సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. జగన్ తో కాకుండా విజయమ్మ.. షర్మిలతో కలిసి వైఎస్ కు నివాళి అర్పించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంతేకాదు కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వంపై పోరాడుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతతో ఇతర కుటుంబ సభ్యులు కూడా షర్మిలతో పాటే వైఎస్సార్ కు నివాళి అర్పించడం ఆసక్తి కల్గిస్తోంది.
వైఎస్సార్ జయంతి సాక్షిగా జరిగిన, జరుగుతున్న పరిణామాలతో కుటుంబంలో జగన్ ఒంటరివాడయ్యారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తన తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా ఉదయమే ఇడుపులపాయకు చేరుకుని నివాళి అర్పించగా.. జగన్ మాత్రం మధ్యాహ్నం 4 గంటలకు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లడం ఇష్టం లేకే జగన్ సాయంత్రం వెళుతున్నారా లేక... కుటుంబ సభ్యులే జగన్ తో కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించడానికి ఇష్టపడలేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. కొడుకు జగన్ తో కొంత కాలంగా విజయమ్మ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె తాడేపల్లి వెళ్లకుండా షర్మిలతో ఉంటున్నారని చెబుతున్నారు.
మొత్తంగా వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. షర్మిలతో పాటు వైఎస్ వివేకా కూతురు కూడా ఇడుపులపాయ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి హత్య కేసు విచారణలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కొంత కాలంగా వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. పరోక్షంగా జగన్ పై కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీత. షర్మిలతో కలిసి ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.