రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. విజయ్ పాల్ అరెస్టు?
posted on Nov 26, 2024 @ 4:57PM
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం (నవంబర్ 25) కొట్టివేయడంతో ఇక ఆయన అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇదే కేసులో ఆయన గతంలో ఆ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో సుప్రీంను ఆశ్రయింంచారు. అక్కడా చుక్కెదురైంది.
ఇలా ఉండగా ఆయన మంగళవారం (నవంంబర్ 26) ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ పై కస్టోడియల్ టార్చర్ కేసులోనే ఆయనీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 13న కూడా పోలీసులు సీఐడీ మాజీ అడిషనల్ ఎస్సీ విజయ్ పాల్ ను విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణకు విజయ్ పాల్ ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అడిగిన ప్రశ్నలకు ఆయన తెలియదు, మరిచిపోయాను, గుర్తు లేదు అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఉదయం నుంచీ ఆయనను విచారించిన పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టును ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.