‘తెలుగువన్’ ఏనాడో చెప్పింది... ఏపీ రాజధాని ‘అమరావతి’
posted on Mar 23, 2015 @ 11:33AM
‘తెలుగువన్’ చెప్పిన నిజం మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెట్టబోతున్నారని ‘తెలుగువన్’ నవంబర్ 12వ తేదీనే చెప్పింది. ఇప్పుడు ఆ పేరును అధికారికంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ‘అమరావతి’ అనే పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఏపీ రాజధాని ప్రతిపాదిన ప్రాంతమైన తుళ్లూరుకు అమరావతి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుకు గత కొద్దికాలంగా పలు రకాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండువేల సంవత్సరాల సంస్కృతికి, భవిష్యత్తుకు అద్దంపట్టే ‘అమరావతి’ అనే పేరు అయితే చారిత్రకంగా బాగుంటుందని చివరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అనే పేరుకే మొగ్గు చూపింది.
అమరావతి అశోకుడి కాలం నుంచీ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అలాగే ప్రసిద్ధ శైవక్షేత్రం కూడా. అలాగే శాతవాహనుల కాలంలో తెలుగువారికి రాజధానిగా విలసిల్లిన ధరణి కోట కూడా అమరావతి దగ్గర్లోనే వుంది. ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమోఘమైన చరిత్ర కూడా వున్న అమరావతి పేరు పెట్టడం సముచితమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టడం వల్ల రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చాలా త్వరగా వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు రాజధానికి పెడితే రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా ‘ఆఫర్’ ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే బౌద్ధ ధర్మం ప్రబలంగా వున్న జపాన్ లాంటి దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు పెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయని, అలాంటి పేరు పెడితే తాము భారీగా పెట్టుబడులు పెడతామని చెప్పాయన్న వార్తలు కూడా వచ్చాయి. ‘అమరావతి’ అనే పేరు రాజధానికి పెట్టడం వల్ల ఏపీ రాజధాని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి జరిగి ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది బౌద్ధులను ఆకర్షించే అవకాశం కూడా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏపీ రాజధాని పేరు ‘అమరావతి’ అంటూ నవంబర్ 12న ‘తెలుగువన్’ ఇచ్చిన కథనాన్ని చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..