అంచనాలను మించుతున్న ఏపీ బడ్జెట్...

 

ఈసారి ఏపీ బడ్జెట్ అంచనాల్ని మించిపోతోంది, మార్చి ఆరో (మార్చి 6) తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్ధికశాఖ రేయింబవుళ్లూ కసరత్తు చేస్తోంది. అయితే అంచనాలకు మించిన ప్రతిపాదనలు రావడంతో ఆర్థిక శాఖ ఆందోళనలో పడింది. వివిధ శాఖల అవసరాలను బట్టి రెండున్నర లక్షల కోట్ల మేర బడ్జెట్ రూపొందిస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. కానీ, అంచనాలకు మించిన ప్రతిపాదనలు మూడున్నర లక్షల కోట్ల మేర రావడంతో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆర్థిక శాఖ ఉంది. వార్షిక అవసరాల కోసం ప్రభుత్వ శాఖలు భారీ డిమాండ్ లు పెడుతున్నాయి. ఖరారు చేసే బడ్జెట్ దాదాపు రెండున్నర లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆయా శాఖల నుంచి మూడున్నర లక్షల కోట్లకు పైగా ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. అవసరాలు, ఖర్చులు తగ్గించుకోవాలని పదేపదే చెపుతున్నా ఆయా శాఖల నుంచి వస్తున్న డిమాండ్ లు భారీగా ఉండటంతో ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ పై వివిధ శాఖల అధికారులతో గత నెల ఆర్థిక శాఖ సమీక్షలు నిర్వహించారు. ఆ తరువాత ఆయా శాఖ నుంచి ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించుకుని ఈ నెల మూడో తేదీ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఇతర శాఖల మంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అవసరాలకు మించి వచ్చిన ప్రతిపాదనలపైనే ఈ సమావేశాల్లో చర్చించారు. గత బడ్జెట్ సమావేశాల్లో కసరత్తు సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది. శాఖల నుంచి డిమాండ్ లు ఎంత భారీగా వచ్చాయంటే, భారీగా నిధుల కేటాయింపుల్లోనూ కోత విధించారు. ఆ నిధులను పలు శాఖలు ఖర్చు చేయలేకపోయాయి. ఇచ్చిన నిధుల్ని ఖర్చుచేయలేకపోవడం ఒకెత్తయితే ఇవ్వాల్సిన నిధులను ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇవ్వకుండా చేతులెత్తేసిన వైనం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. ఇదే సమయంలో గత బడ్జెట్ లో కన్నా ఈ సారి సంక్షేమానికి నేరుగా నగదు బదిలీకి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశముంది. నవరత్నాల పేరుతో ప్రవేశ పెట్టిన అనేక పథకాలకే లక్ష కోట్లు కావాల్సి వస్తుంది. దీంతో ఇతర ఖర్చుల్లో కోత తప్పదన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రతిపాదనల్లో అత్యవసరమైన వాటికే డిమాండ్ చేయాలని ఆర్థిక శాఖ పేర్కొంటుంది. భారీ బడ్జెట్ ను, శాఖల డిమాండ్ లను యధాతథంగా అమోదిస్తే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ముందుగా నవరత్నాలు, ఉద్యోగుల జీతాలు, పింఛన్ లకు పెద్ద పీట వేసిన తర్వాతే ఇతర పథకాలకు నిధులు కేటాయించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది.

Teluguone gnews banner