సోము వర్సెస్ వీర్రాజు.. పిచ్చ కామెడీ
posted on Jul 12, 2021 9:06AM
ఆయనకు ఏమైంది? తెలిసి చేస్తున్నాడా... తెలియక చేస్తున్నాడా? తెలిసి కూడా నటిస్తున్నాడా? లేక పదవి పోతుందనే భయంలో పడి..ఏది బడితే అది చేస్తున్నాడా.. ఇన్నిడౌట్స్ వచ్చేస్తున్నాయి.. అయ్యవారి యాక్షన్ ప్లాన్స్ చూస్తుంటే. అసలు ఆయన వ్యవహారం చూస్తుంటే అపరిచితుడు సినిమా గుర్తొస్తోంది. అందులో రెమో కేరెక్టర్ తో అపరిచితుడు ఫైట్ చేసే షాకింగ్ సీన్ గుర్తొచ్చేస్తుంది. తనను తానే కొట్టుకుంటూ..తానెవరినో కొడుతున్నానని బిల్డప్ ఇచ్చుకుంటూ..తన్నులు తింటూ చూసేవాళ్లను పిచ్చోళ్లని చేసే ఆ సీన్.. బాస్ పోలవరంలో రిపీట్ చేస్తున్నాడు.
పోలవరంలో సోము వీర్రాజుగారి పర్యటన. నిర్వాసితుల పరిహారంపై పర్యటన.. దానిపై పోరాడతానని ప్రకటన.. ఇవి చూస్తే నిజంగానే పిచ్చెక్కిపోతోంది. అసలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని ఇవ్వాల్సింది కేంద్రం. ఇప్పటివరకు ఇవ్వలేదు. పైగా ఇస్తుందో లేదో క్లారిటీ లేదు. జాతీయ ప్రాజెక్టు..బడ్జెట్ అంతా మాదే అని..ఆర్ అండ్ ఆర్ ఆ లెక్కలోకి రాదని డ్రామా వేస్తున్నారు. జగన్ సార్ ఎటూ గట్టిగా అడగలేడు కాబట్టి సర్దుకుపోతున్నాడు. మరి బిజెపి వారేమైనా మాట్లాడారా అంటే లేదు. పైగా చంద్రబాబునాయుడు ఇష్టమొచ్చినట్లు డిజైన్లు మార్చేస్తే మేం ఆ డబ్బులు ఇవ్వాలా అంటూ దబాయించారు సోము వీర్రాజు గారు.
ఇప్పుడుఆ నిర్వాసితులకు ప్యాకేజ్ వెంటనే అమలు చేయాలని పోలవరం పర్యటన పెట్టుకున్నారు. మరి కేంద్రం డబ్బులిచ్చేసిందా.. ఇచ్చిన రాష్ట్రం ఇవ్వటం లేదని పోరాడుతున్నారా? లేక మావోళ్లు ఇవ్వరని చెప్పేశారు కదా...రాష్ట్రానిదే బాధ్యత .. ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తారా? విభజన తర్వాత లోటు బడ్జెట్ కూడా ఇప్పటివరకు ఇవ్వని కేంద్రం.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పట్టించుకోని కేంద్రం.. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఇప్పుడు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు .. అది కూడా జాతీయ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలని.. నిర్వాసితులకు న్యాయం చేయాలని.. డిమాండ్ చేస్తారా? అంటే న్యాయం చేయాలని అన్యాయం చేసినవారే నినదిస్తారా? క్యా బాత్ హై.
అసలు ఇప్పటివరకు నిర్వాసితులకు పరిహారం అందకపోవడానికి చాలా కారణాలున్నాయి. మామూలుగానే ప్రాజెక్టులు కట్టేసుకుంటారు..కాంట్రాక్టర్లు బిల్లులు తీసేసుకుంటారు.. నిర్వాసితులకు పరిహారం మాత్రం దక్కదు. ఎందుకంటే దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాలకులైనా..ఇంకెవరైనా. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తామంటుంటే..ఇంకా మాకు పరిహారమే అందలేదు..ఇదేంటి అని నిర్వాసితులు రోడ్డెక్కితే అందరూ ఆశ్చర్యపోయారు.ఇప్పటికీ వీరికి అందలేదా? అంతెందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి ఇంకా పరిహారం అందలేదంటే నమ్ముతారా?నమ్మాలి.. అది నిజం.
అడిగేది కరెక్టే...ఇవ్వాల్సింది కరెక్టే. నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాల్సిందే. కాని కోడికి మేత వేయాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపోడు ధర్నా చేసినట్లే ఉంటుంది ఈ బిజెపి ఆందోళన కార్యక్రమం. అంత ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి బడ్జెట్ వెంటనే రిలీజ్ చేయిపిస్తే..న్యాయం చేసినోళ్లవుతారు మరి.
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏదో నరం కట్ అయినట్లే ఉంది వీర్రాజు గారి వ్యవహారం. పోలవరం నిర్వాసితులకు న్యాయమంటూ ఒక డ్రామా వేస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఒక పక్క విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టేసే పనిలో కేంద్రం బిజీగా ఉంటే..అబ్బే అమ్మే సమస్యే లేదని ఈయనగారు ప్రకటిస్తున్నారు. ఆయనను ఆయనే మోసం చేసుకుంటున్నాడా?ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడా? ఏమో సోము వీర్రాజుగారే తెలుసుకోవాలి.