చరిత్ర స్పష్టించిన బండ్ల శిరీష.. విజయవంతమైన వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర
posted on Jul 11, 2021 @ 9:36PM
ఆకాశ వీధిలో అద్బుతం ఆవిష్కతమైంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతైంది. రిచర్డ్ బ్రాన్సన్ బృందం రోదసిలోకి వెళ్లి విజయవంతంగా తిరిగొచ్చింది. ఆరుగురు సభ్యుల బృందం దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చింది. బ్రాన్సన్ టీమ్ మెంబర్ గా నింగిలోకి వెళ్లి తెలుగుమ్మాయి బండ్ల శిరీష చరిత్ర స్పష్టించింది. రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్లిన నాలుగో భారత వ్యోమగామిగా, తొలి తెలుగు మహిళగా తన పేరును చరిత్రలో లిఖించుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష.. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా ఆమె రోదసీలోకి వెళ్లింది. అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారి నుంచి వీఎస్ఎస్ యూనిటీ-22 రోదసిలోకి దూసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు నింగిలోకి వెళ్లి.. 60 నిమిషాల తర్వాత తిరిగొచ్చారు.
వాతావరణ మార్పుల కారణంగా నిర్దేశిత సమయానికి గంటన్నర ఆలస్యంగా అంతరిక్ష ప్రయాణం మొదలైంది. న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగింది. మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.
భూమి నుంచి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న వ్యోమనౌక భూమికి, రోదసీకి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖను దాటి వెళ్లింది. ఇక్కడికి చేరిన వారిని వ్యోమగాములుగానే పరిగణిస్తారు. వ్యోమనౌక అక్కిడికి చేరాక అందులోని వారందరూ కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవించారు. అనంతరం వ్యోమనౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. 34 ఏండ్ల బండ్ల శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహించారు. ఇప్పటికే 3 సార్లు స్పేస్ ఫైట్లను వర్జిన్ గెలాక్ట్ అంతరిక్షంలోకి పంపింది. తాజా ప్రయోగంలో మనుషులను రోదసీలోకి తీసుకెళ్లింది చరిత్ర స్పష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. హ్యూస్టన్‌లో పెరిగారు. తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుంది. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో తెలిపింది.