మెలికల మాస్టార్లు!
posted on Feb 1, 2014 @ 12:04PM
రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2013 అసెంబ్లీ సభ్యుల మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురైంది. యాస్ పర్ రూల్స్ అండ్ రెగ్యులరేషన్స్ ప్రకారం ‘గౌరవనీయులైన రాష్ట్రపతి గారూ, మీరు రాష్ట్ర పునర్విభజన కోసం మాకు పంపిన బిల్లు అత్యంత పనికిమాలిన, అసంపూర్ణంగా వున్న బిల్లు. అందువల్ల మేం దీన్ని తిరస్కరిస్తూ మీకే తిప్పి పంపుతున్నాం’ అనే అర్థం వచ్చే సందేశాన్నిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర శాసనభ్యులు తిరస్కరించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం తమ సహజ శైలిలో విపరీతార్థాలు లాగుతూ, మెలికల మీద మెలికలు వేస్తూ మాట్లాడుతూ ఆత్మానందం పొందుతున్నారు.
అసెంబ్లీ నిర్ణయంతో టోటల్‌గా డంగైపోయిన విభజనవాదుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ అంశాన్ని లైట్‌గా తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అంతా మంచే జరిగిందని, ఇక ఢిల్లీలో మా సత్తా చూపిస్తామని చెబుతున్నారు. అసెంబ్లీ తీర్మానానికి అసలు విలువే లేదని, తాము మాట్లాడే మాటలకే బోలెడంత విలువుందని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగతావాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఏదోలే పాపం అనిసానుభూతితో అర్థం చేసుకోవచ్చు. అయితే బాధ్యతాయుతమైన, కీలకమైన పదవుల్లో వున్నవారు కూడా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఏమనుకోవాలి?
శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. సీఎం ప్రవేశపెట్టిన, అసెంబ్లీ ఆమోదించిన బిల్లు తిరస్కరణ తీర్మానం రాష్ట్రపతి దగ్గరకి వెళ్ళదట, అసెంబ్లీ బిల్లు తిరస్కరించిందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే తెలియజేస్తారట. మల్లు భట్టి విక్రమార్క చేసిన ఈ ప్రకటన ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా వుందని, రాజ్యాంగాన్ని ప్రశ్నించేలా వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ తనకున్న ప్రాంతీయాభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి అత్యుత్సాహం చూపించారని భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లాంటి ఉన్నత స్థానంలో వున్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం భావ్యం కాదని అంటున్నారు.