శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
posted on Sep 24, 2025 @ 9:44AM
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం (సెప్టెంబర్ 24) నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం(సెప్టెంబర్ 23) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాత్రి 7.50 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.