అంబానీలను కలిపిన నయనతార పెళ్ళి

 

ఒకరిపై మరొకరికి సరయిన రిలయన్స్ లేకపోవడంతో ఐదేళ్ల క్రితం విడిపోయిన ముకేష్ అంభానీ, అనిల్ అంభానీలను నయనతార కలిపింది. అదికాకుండా ఇటీవలే ఆమె పెళ్లి కూడా చేసేసుకోంది. అంభానీసోదరులు ఆమె పెళ్లికి రావడమే కాకుండా వారిరువురూ 1,200 కోట్ల విలువయిన ఒక బిజినస్ ఒప్పందం కూడా అక్కడే చేసుకొన్నారు.

 

నయనతార పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ పెళ్ళికి అంభానీలు రావడం ఏమిటి? అంభానీలను నయనతార కలపడమేమిటి? అన్నదమ్ముల సవాల్ అంటూ విడిపోయిన అంభానీ సోదరులు మళ్ళీ కలిసి 1,200 కోట్ల బిజినెస్ ఏమిటి? అంతా గందరగోళంగా ఉందా? అయితే ఈ కధ పూర్తిగా వినవలసిందే మరి. ఫ్లాష్ బ్యాకులో ముకేష్ అంభానీ, అనిల్ అంభానీలు గొడవలు పడివిడిపోవడం మనం ఇదివరకే చూసేసాము గనుక ఇప్పుడు ఆ స్టోరీ వద్దు. నేరుగా ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే కధ మొదలుపెట్టుకొందాము.

 

ఇక, గ్రీకువీరుడుతో రోమాన్స్ చేస్తున్న మన నయనతార ఇంకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ, అంభానీలకి కూడా నయనతార అనే ఒక మేనకోడలు ఉంది. ప్రస్తుతం జరిగింది ఆమె పెళ్ళే. ముకేష్ అంభానీ ముచ్చటపడి ముంబైలో కట్టించుకొన్న తన 27 అంతస్తుల అంటిలా కుటీరంలో ఆమె పెళ్ళికి తన సోదరుడు అనిల్ అంభానీని కూడా ఆహ్వానించారు.

 

ఆ సందర్భంగా కలిసిన అంభానీ సోదరులు నయనతార పెళ్లి మాట ఎలా ఉన్నా, 1200 కోట్ల విలువయిన ఒక బిజినస్ ఒప్పందం చేసుకొని యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ముకేష్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగించుకునేందుకు ఒప్పందం కుదిరింది.

 

త్వరలోనే దేశంలో 4జి సర్వీసులను ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న ముకేష్ అంభానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ కంపెనీ దానికి అవసరమయిన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పెద్దగా పెట్టుబడి అక్కరలేకుండానే (కేవలం 1200 కోట్లతోనే) తనపని పూర్తిచేసుకొనే అవకాశం ఈ ఒప్పందంవలన ఏర్పడగా, భారీ పెట్టుబడి పెట్టి దేశ వ్యాప్తంగా ఆప్టికల్ కేబిల్స్ వేసినప్పటికీ దానినుండి ఆశించిన ఫలితం రాకపోవడంతో నష్టాలు చవిచూస్తున్న అనిల్ అంబానీ కంపెనీ ఆర్‌కామ్‌ కు ఈ ఒప్పందం వలన ఒకేసారి ఊహించని బిజినెస్ దొరికింది. తద్వారా అన్నదమ్ములిద్దరి కంపెనీలు లాభాపడటమే కాకుండా, డబ్బు మొత్తం వారి కుటుంబంలోనే చేతులు మారుతుంది.

 

ఈ అన్నదమ్ముల అనుబంధం మరింత బలపడితే మున్ముందు ఇద్దరూ చేతులు కలిపి ఒకరికొకరు చేయూతనందించుకొంటూ తమకి చెందిన కంపెనీలలో నష్టాల్లో ఉన్న కొన్నిటిని మళ్ళీ చక్కబెట్టుకోవచ్చును. ఇదివరకే అనిల్‌ అంభానీకు చెందిన మ్యూచ్‌ఫండ్ సంస్థలలో ముకేష్ కంపెనీలు దాదాపు 800 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.

 

ఇప్పుడు వారిరువురి మద్య ఏర్పడిన సహృద్భావా వాతావరణంతో వారిరువురు కలిసి మరిన్నివ్యాపార ఒప్పందాలు చేసుకొన్నా ఆశ్చర్యం లేదు. ఇది వారికే కాక వారి సంస్థలలో షేర్ల రూపంలో పెట్టుబడిన మదుపరులకు లాభాలను ఆర్జించి పెట్టే అవకాశం కూడా ఉంది. ఏమయినప్పటికీ ఈ అన్నదమ్ముల అనుబంధం ఎంత దృడంగా ఉంటే అంత అందరికీ లాభాలు పండుతాయి.

Teluguone gnews banner