ఆదుకోవడం ఆరంభం...
posted on Feb 5, 2015 @ 9:44AM
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 850 కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ఏపీ అధికార వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది తొలివిడత సహాయం కావడం, భవిష్యత్తులో కేంద్రం నుంచి మరికొన్ని ప్యాకేజీలు అందే అవకాశం వుండటం శుభ పరిణామమని ఏపీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు వచ్చిన ప్యాకేజీ ఇదే ఆఖరు అనే ప్రచారాన్ని కొన్ని వర్గాలు పనిగట్టుకుని చేస్తున్నప్పటికీ, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత సహకారాన్ని అందించడానికి కృతనిశ్చయంతో వుందని తెలుస్తోంది. అలాగే ఈ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండబోదేమో అనే అపోహలు కూడా అవసరం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవడం లేదన్న అపప్రధను తొలగించడానికి ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ ఉపయోగపడుతోంది. కేంద్రం ప్యాకేజీ కారణంగా ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు మేలు జరుగుతుంది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందాల్సినవన్నీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా ఆర్థిక శాఖ నుంచి ఖచ్చితమైన హామీ కూడా లభించడం శుభ పరిణామం. ఇప్పుడు కేంద్ర ప్రకటించిన ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకునే క్రమానికి ఆరంభమని పరిశీలకులు భావిస్తున్నారు.