పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్.. పారిశ్రామిక ప్రగతిలోనూ గణనీయ పురోగతి

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన సంవత్సరంలో దేశంలో నమోదైన మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా పాతిక శాతానికి మించి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు.

గడిచిన ఏడాదిలో దేశం మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతమని పేర్కొన్నా ఆయన ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రం కన్నా అధికమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీ ఒడిషా, మహారాష్ట్రాలను దాటి ముందంజలో ఉందన్నారు.  పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించిన విధానాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయనీ లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు. గడిచిన  ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో  దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా  ఏపీ దక్కించు కోగా,  ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో  13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో  12.8 శాతం వాటాతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలూ కలిసి దేశ వ్యాప్తంగా పెట్టుబడులలో 51.2 శాతం వాటా దక్కించుకున్నాయి.  

బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం

  హైదరాబాద్‌ నగరంలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. జంతు హింసతో పాటు డ్రగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఒక ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ కంపెనీపై విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించగా, భారీగా రక్త నిల్వలు బయటపడ్డాయి. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారుల కంటపడిన దృశ్యాలు విస్మయానికి గురి చేశాయి. గోదాములలో ప్యాకెట్ల రూపంలో భారీగా గొర్రె, మేక రక్తాన్ని నిల్వ చేసి ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు వెయ్యి లీటర్లకు పైగా రక్తంను ప్యాకెట్లలో భద్రపరిచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ రక్తాన్ని నిల్వ చేయడం, తరలించడం పూర్తిగా అక్రమమని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. రక్తానికి సంబంధించిన అన్ని ప్యాకెట్లను సీజ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ రక్తాన్ని హర్యానాలోని పాలీ మెడికూర్ అనే కంపెనీకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ పేరుతో రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ, ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు అనుమాని స్తున్నారు. అసలు గొర్రె, మేకల రక్తాన్ని ఏ అవసరానికి వినియోగిస్తున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఈ రక్తాన్ని క్లినికల్ ట్రయల్స్‌, ఔషధ తయారీ లేదా బయో–మెడికల్ ప్రయోగాల కోసం అక్రమంగా ఉపయోగిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు కొనసాగించారు.  దీనికి సంబంధించిన పత్రాలు, లైసెన్సులు ఏవీ కంపెనీ వద్ద లభించలేదు. CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీ లో ఉన్నాడు. గత రెండు రోజులుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నికేష్‌ను అదుపులోకి తీసుకుంటే రక్తం సేకరణ, నిల్వ, సరఫరా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రాంతాల్లో గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం లభించింది. ఎలాంటి వెటర్నరీ పర్యవేక్షణ లేకుండా, జంతువులకు తీవ్ర హింస చేస్తూ ఈ రక్తాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జంతు సంక్షేమ చట్టాలకు పూర్తి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో కేంద్ర డ్రగ్ కంట్రోల్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశ ముంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, జంతు హింస నిరోధక చట్టం, అక్రమ రవాణా నిబంధనల కింద కేసులు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అక్రమ రక్త వ్యాపారం వెనుక మరిన్ని కంపెనీలు, వ్యక్తులు ఉన్నారా? దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడికి ఈ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసా గుతోంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదు నగరంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రియులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు... అసలు ఈ రక్తంతో ఏం చేస్తున్నారనే పూర్తి వివరాలు నిందితుల అరెస్టులతోనే వెలుగులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్  నోటీసులో పేర్కొన్నాది. రేవంత్‌ రెడ్డి  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్‌ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్‌ కోరినట్లు సమాచారం. ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి.  మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్‌ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సిట్‌ రెండు దఫాలుగా కస్టోడియల్‌ విచారణ పూర్తి చేసింది.  

సోషల్ మీడియాలో బాలల లైంగిక దోపిడీకి పాల్పడిన...యూట్యూబర్ అరెస్టు

  సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ పిల్లలను లైంగికంగా దోపిడీ చేస్తూ, అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసిన కేసులో క్రైమ్ నెం.1885/2025గా నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన కంబెటి సత్యమూర్తి (39)* “వైరల్ హబ్” (@ViralHub007) పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, వీక్షణలు మరియు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో మైనర్లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వీడియో లను రూపొందించాడు.  నిందితుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలతో ఇంటర్వ్యూలు నిర్వహిం చాడు. ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన, లైంగికంగా స్పష్టమైన ప్రశ్నలు అడిగేవాడు. కొన్ని వీడియోల్లో మైనర్ పిల్లలను ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని ప్రేరేపించాడు. ఇది బాలల లైంగిక దోపిడీకి సమానమని అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియోల్లో ఉపయో గించిన భాష, ప్రవర్తన పూర్తిగా నీచమైనదిగా, చట్టవిరుద్ధమైనదిగా ఉండటంతో పాటు, పోక్సో చట్టం, ఐటీ చట్టం మరియు ఇతర క్రిమినల్ చట్టాల నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు తేలింది. వీడియోల్లో కనిపించిన మైనర్ల వయస్సు సుమారు 15 నుంచి 17 సంవత్సరాలు గా పోలీసులు అంచనా వేశారు. 2025 అక్టోబర్ 16న ‘వైరల్ హబ్’ యూట్యూబ్ ఛానెల్‌లో బాలల దుర్విని యోగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నట్టుగా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు, సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ ఆధారాల సేకరణ అనంతరం నిందితుడి పాత్రను నిర్ధారించి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కి చెందిన కంబెటి సత్యమూర్తి(39) 2018 నుంచి యూట్యూబర్‌ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మొదట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయె న్సర్‌లతో అసభ్య భాషతో ఇంటర్వ్యూలు నిర్వహించి వ్యూస్ సంపాదించాడు.  ఆ తరువాత మరింత ఆదాయం, ప్రచారం కోసం మైనర్లను లక్ష్యంగా చేసుకుని అత్యంత అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం, లైంగిక సూచనలతో కూడిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా తీవ్రమైన క్రిమినల్ నేరాలకు పాల్ప డ్డట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్ కంటెంట్ కోసం మైనర్లను దోపిడీ చేయడం తీవ్రమైన నేరమని తెలిపారు.  మైనర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేయడం, అనుచిత చర్యలకు ప్రేరేపించడం, అటువంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం శిక్షార్హమని స్పష్టం చేశారు.బాలలపై లైంగిక దుర్వినియోగ కంటెంట్‌ను సృష్టించినా, పంచుకున్నా, ఫార్వార్డ్ చేసినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. పిల్లలపై వేధింపుల కంటెంట్ లేదా ఏదైనా సైబర్ నేరానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజే యాలని సూచించారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

ప్రియురాలి మృతి... ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ప్రియుడు సూసైడ్

  హయత్‌నగర్, యాచారం ప్రాంతాల్లో వరుసగా చోటుచే సుకున్న ఆత్మహత్యలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయ విదారక సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. యాచారం మండలంలో నివాసం ఉంటున్న పూజ (17) అనే బాలిక నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే పూజ మరణించినట్లుగా వైద్యులు దృవీకరించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో  ప్రేమ జంట సిద్ధగోని మహేష్ (20), పూజ(16) గత నాలుగు నెలలుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.  దీంతో ఇటీవలే ఈ ప్రేమ జంట మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం రోజు ప్రియుడు మహేష్ బాలిక పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తీవ్ర మన స్థాపానికి గురైన పూజ మంగళవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పూజ మృతికి కారణం ఆమె ప్రేమ వ్యవహారమేనని బంధువులు ఆరోపిస్తు న్నారు. పూజ, సిద్ధగోని మహేష్‌ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబ సభ్యులకు తెలుసు... పూజ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు.  అయితే పూజ ఆత్మహత్యకు బాధ్యుడిగా మహేష్‌ను పేర్కొంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మహేష్‌ను విచారణకు పిలిచారు.పూజ ఆత్మహత్య చేసుకున్న విషయం  తెలియగానే మహేష్ తీవ్ర మనస్తాపానికి గురై నాడు. పూజ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు లోనైన మహేష్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటిం చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే మహేష్ మృతి చెందాడు..మహేష్, పూజ ఇద్దరూ గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అప్పట్లో కుటుంబ సభ్యులు, పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుబాటు చేసినట్లు సమాచారం. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు ఈ విషా దాంతానికి దారి తీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రేమికులు మరణించడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి..ఈ రెండు ఘటనలపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారంలోని అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత ... కాంగ్రెస్ నేత అరెస్ట్

రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులు ఇళ్లు,కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.  ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల్లో సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేసినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్ కుమార్ అరెస్ట్‌తో  నిజామాబాద్ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక వ్యక్తులకు సిట్ నోటీసులు

తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కుమారుడు సందీప్‌కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోసం వీరిని విచారించ నున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వారు బుధవారం (జనవరి 7) హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, రాజకీయ నేతలు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారం సాగిందన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జారీ చేసిన నోటీసులతో కేసు కీలక దశకు చేరినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అమరావతి వేదికగా ఒలింపిక్స్.. మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను బుధవారం (జనవరి 7) ప్రారంభించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందు కోసం  రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు . ఈ ఏడు గ్రామాల రైతుల నుంచి స్వీకరించే భూమిని అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఒలంపిక్స్ నిర్వహిస్తామన్నారు.   రైతులు భూములపై తీసుకున్న రుణాలను గతంలో రూ.1.5 లక్షల వరకు మాఫీ చేశారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం, నిధులు విడుదల చేయవద్దని వరల్డ్ బ్యాంక్‌కు లేఖలు రాయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు .గ్రామాల్లోని అంతర్గత నిర్మాణాలు, రోడ్‌లు, డ్రైన్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శ్రావణ్ కుమార్ సూచించారు . హరిశ్చంద్రపురం ఈనాం భూముల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని, తాడికొండ నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 3 గ్రామాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని   ఎమ్మెల్యే కోరారు.

బ్లో అవుట్ ప్రాంతంలో తెరుచుకున్న పాఠశాలలు

బ్లోఅవుట్ ముప్పు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా మలికిపురం మండలంఇరుసుమండలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అక్కడ పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు.  ఇరుసుమండలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి.  ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్‌ లో బ్లో ఔట్ సంభవించి భారీగా మంటలు ఎగసిపడిన సంగతి తెలిసిందే. మూడు రోజులు అవుతున్నా మంటలు అదుపులోనికి రాలేదు కానీ, బుధవారం (జనవరి 7) నాటికి మంటల తీవ్రత తగ్గింది.   అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు పూర్తిగా ఆగిపోవడానికి  వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు.  బ్లో అవుట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్‌జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు.  బ్లో అవుట్‌కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాదుర్ కోరారు. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్‌ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. పాత గ్యాస్ పైపులైన్లు మార్చాలని కూడా కోరుతున్నారు.

రాజధాని అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైన రెండో విడత ల్యాండ్ పూలింగ్  బుధవారం (జనవరి 7) మొదలైంది. రాజధాని ప్రాంతంలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడమే ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ లక్ష్యం.   ఈ రెండో విడతలో భాగంగా బుధవారం (జనవరి 7)  యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలోని మూడు గ్రామాలు (వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి)లో 9,097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 ఎకరాల అసైన్డ్ భూమి, అలాగే పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7,465 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు.   ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వచ్చే నెల 28 నాటికి పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   ఈ ప్రక్రియ పారదర్శకంగా, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయనున్నారు.  

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు రేపటితో ముగింపు

తిరుమల పుణ్యక్షేత్రంలో గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం (జనవరి 8)తో  ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని, గత ఏడాది డిసెంబర్ 30నుంచి భక్తులకు టీటీడీ  ఉత్తర ద్వార దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే.  శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు  ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన  తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం (జనవరి 8) అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య  ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది. కాగా ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించిన పది రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఎల్లుండి నుంచి తిరుమల కొండపై   బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలు   ప్రారంభం కానున్నాయి.