వెనిజులాపై అమెరికా బాంబు దాడులు
posted on Jan 3, 2026 @ 2:10PM
వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా ఆ దేశంపై బాంబు దాడులకు దిగింది. వెనిజులా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుఝామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడం ఆ దేశ వాసుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ క్రమంలో దేశంలో ఎమెర్జన్సీ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది. దాంతో సైనిక స్థావరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్ పెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసింది. అమెరికా విమానాలు వెనిజులా గగనతలాన్ని వినియోగించవద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఆ ముఠాలతో నికోలస్ మదుకోకు కూడా సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపి స్తుండటంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్దనౌకలు, సబ్‌మెరైన్లు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మొహరించింది.