అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం! దళిత సంఘాల రాస్తారోకో...
posted on May 22, 2024 @ 4:31PM
పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. పట్టణంలోని అగ్రహారం పశువుల సంత సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం చేశారు. అంతటితో ఆగక, విగ్రహం ముఖంపై కసిగా గాట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు అక్క డకు చేరుకుని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకోకి దిగారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నుంచి, ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహ ధ్వంసాలకు పాల్పడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. రాజకీయ నాయకులకు పరిమితులంటూ ఏమీ ఉండవు. ఏ విషయాన్ని అయినా తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందనుకుంటే ఎంతటికైనా తెగిస్తారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం ప్రజల పేరుతో ప్రతి విషయానికి రాజకీయ రంగు పులుముతుంటారు. అందుకు నాయకుల విగ్రహాలు కూడా మినహాయింపేమీ కాదు.
రాజకీయ నేతలు విగ్రహాల విధ్వంసానికి ఎందుకు పాల్పడతారంటే....? ఎందుకంటే వారి దృష్టిలో ఇదే సులువైన మార్గం. ఖర్చులేనిది, శ్రమ లేనిది, జన సమీకరణకు రాజకీయ పార్టీలు కష్ట పడాల్సిన పని లేదు. దేవతా విగ్రహాలు, లేదా రాజకీయ ప్రముఖుల విగ్రహాలు. ఎవరి అవసరం వారిది. ఎప్పుడు ఏలాంటి రాజకీయాలకు పాల్పడాలో మన నేతలకు బాగా తెలుసు. పైసా ఖర్చులేకుండా భారీ ఎత్తున ప్రచారం లభిస్తుంది. జనాల్ని రెచ్చగొట్టవచ్చు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో విఫలమైందని చూపించడం తేలిక. ఇప్పుడు ఏపీలో మళ్ళీ 'విగ్రహ ధ్వంస' రాజకీయానికి తెర లేచింది.
- ఎం.కె. ఫజల్