జోగి రమేష్ నోట ప్రతిపక్షం మాట.. ఓటమి ఒప్పేసుకున్నట్లేనా?

విజయంపై విశ్వాసం వ్యక్తం చేయడంలో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయిపోయినప్పటికీ కొందరు మాత్రం ఇంకా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. వీరిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ లు ముందు వరుసలో ఉంటారు. వారి ప్రకటనలను నమ్ముతున్నదెవరు? నవ్వి పోతున్నదెవరు అన్నది పక్కన పెడితే.. వారి ప్రకటనల్లోని డొల్లతనం వారి మాటల్లోనే కనిపించేస్తోంది. తాజాగా జోగి రమేష్ జూన్ 4న సంబరాలకు సిద్ధం కండి అంటూ పార్టీ శ్రేణులకు ఓ పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఆయన సందర్భమో అసందర్భమో కానీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటన గురించి ప్రస్తావించారు. కోర్టుల అనుమతి తీసుకోవలసిన అవసరం చంద్రబాబుకు లేకపోవడం చేత ఆయన విదేశీ పర్యటనకు పెద్దగా ప్రచారం లేదు. ప్రచారం అవసరం కూడా లేదు. వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్లడం ఆయనకు ఇదే మొదటి సారీ కాదు. కాకపోతే వైసీపీ అధినేత దేశం విడిచి వెళ్లాలంటే ఆయనకు కోర్టు అనుమతి కావాలి. బెయిలుపై ఉన్నందున, అందునా షరతులతో కూడిన బెయిలుపై ఉన్నందున ఆయన పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. కోర్టు అనుమతి తీసుకుని ఆ పాస్ పోర్టు తీసుకుని ఆయన విదేశీయానం చేయాల్సి ఉంటుంది.

ఈ సారి కూడా ఆయన కోర్టు అనుమతి తీసుకునే విదేశాలకు వెళ్లారు. అయితే ఈ సారి ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం తెలిపింది. ఆ మేరకు సీబీఐ  కోర్టులో కౌంటర్ కూడా వేసింది. సరే అయినా ఆయన విదేశీపర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అది కూడా షరతులతో.. ఆయన ఫోన్ నంబర్, ఈమెయిల్ సంబంధిత అధికారులకు ఇచ్చి మరీ వెళ్లాలని షరతు విధించింది. అది పక్కన పెడితే.. జోగి రమేష్ తాను తాజాగా సంబరాలకు సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిస్తూ పనిలో పనిగా చంద్రబాబు విదేశీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చేస్తూ పొరపాటునో, గ్రహపాటునో వాస్తవం చెప్పేశారు.

నిజమే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెడుతూ కనీసం ప్రతిపక్షానికి చెప్పను కూడా చెప్పలేదని గింజు కున్నారు. అంటే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెడుతూ ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వాలన్నారు. అంటే ఏపీలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేననీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయేది చంద్రబాబేననీ అంగీకరించేశారు. అలాగే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమౌతుందని చెప్పేశారు.  దీంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇంతకీ జోగి రమేష్ సంబరాలకు రెడీ కావాలంటూ ఇచ్చిన పిలుపు విపక్షం కాబోతున్నందుకా అని గందరగోళంలో పడ్డారు. 

Teluguone gnews banner