లండన్‌లో అంబానీ లగ్జరీ ప్యాలెస్.. ముకేష్ రేంజ్‌కు తగ్గట్టు రిచ్‌నెస్..
posted on Nov 6, 2021 @ 11:54AM
ముకేశ్ అంబానీ. దేశంలోకే రిచెస్ట్ పర్సన్. లక్షల కోట్ల సంపద. క్రూడాయిల్ నుంచి కూరగాయల వరకూ అనేక బిజినెస్‌లు. ఏటేటా వందల కోట్ల లాభాలు. అంతటి సంపన్నుడు కాబట్టే.. ఆయన లివింగ్ స్టైల్ కూడా అంతే రిచ్‌నెస్‌గా ఉంటుంది. ప్రైవేట్ విమానాలు, లెక్కలేనన్ని కార్లు ఆయన సొంతం. ఇక ఇండియాలోకే కాస్ట్లీ హౌజ్ యాంటిలియాలో ఉంటారు. ఆ ఆకాశహర్మ్యం ఇంటి గురించి ఎంత చెప్పినా తక్కువే. వేసవిలో ఏ హిమాలయాలకో వెళ్లకుండా ఇంట్లోనే మంచుకొండలను తలపించేలా ఫ్రీజర్‌లాంటి ఏర్పాటుతో ప్రత్యేక హాల్ ఉందంటే.. ఇక మిగతా లగ్జరీస్ గురించి ఊహించుకోవచ్చు. అలాంటి ముకేశ్ అంబానీ.. కొత్తగా లండన్‌లో మరింత ఖరీదైన ప్యాలెస్ కొన్నారట. ముంబైలో అంటే ప్లేస్ సరిపోక.. టవర్‌లాంటి ఇంటిలో ఉంటున్నారు. అదే లండన్‌లో అయితే.. ఏకంగా ఓ ఊరంత ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అంబానీ లండన్ ప్యాలెస్ విశేషాలు మరింత అద్భుతంగా ఉన్నాయంటున్నారు.
లండన్‌లో బకింగ్‌హాంషైర్‌లో 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘స్టోక్ పార్క్’ను అంబానీ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఎస్టేట్‌తో కూడిన ఆ ప్యాలెస్ ఖరీదు.. 592 కోట్లు అంటున్నారు. ‘స్టోక్ పార్క్’లో 49 లగ్జరీ బెడ్‌రూమ్స్ ఉన్నాయట. ఆ ప్యాలెస్‌లోనే ప్రత్యేక హాస్పిటల్ కూడా ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ‘స్టోక్ పార్క్’ను అంబానీ కొనుగోలు చేశారని.. ఆ తర్వాత దాన్ని తమ అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ దీపావళిని ముకేశ్ కుటుంబం లండన్‌లోని తమ కొత్త ఇంట్లోనే జరుపుకుందని కూడా అంటున్నారు.
లండన్ ప్యాలెస్‌పై రిలయన్స్ సంస్థ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. స్టోక్‌పార్క్‌ను ప్రీమియర్ గోల్ఫ్, క్రీడలకు వేదికగానే మారుస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ ఆర్‌ఐఐహెచ్‌ఎల్ తెలిపింది. భారతీయ ఆతిథ్యాన్ని అంతర్జాతీయంగా చూపేందుకు ఈ ప్రాంగణాన్ని వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ముకేశ్ అంబానీ ముంబైలోని తన నివాసాన్ని మార్చడం లేదని, యాంటిలియాలోనే ఆయన ఉంటారని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.