చంద్రబాబు పలక ప్రచారం.. చౌకబారుగా ఉందని విమర్శలు
posted on Oct 21, 2015 @ 4:20PM
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వంహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచారం ఎప్పుడో మొదలైంది. దీనిలో భాగంగానే "మన అమరావతి - మన రాజధాని" పేరుతో వీడియో తీసి వాటి ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అయితే అక్కడితో ఆగకుండా వినూత్నంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు చంద్రబాబు. అది అలా ఇలా కూడా కాదు పలకతో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు తన కుటుంబసభ్యులు ఆయన సతీమణి, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణి, ఆఖరికి మనవడు దేవాన్ష్ తో సహా అందరిని ఈ ప్రచారంలోకి లాగారు. అంతా బానే ఉన్నా ఈ ప్రచారం పై కొంత మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పలకలతో చేస్తున్న ఈ ప్రచారం అత్యంత చౌకబారుగా ఉందని విమర్సిస్తున్నారు. అయితే మనవడు దేవాన్ష్, కోడలు స్మార్ట్ ఫోన్ తో ప్రచారం బాగుంది కానీ పలకలతోనే మరీ ఇబ్బందికరంగా ఉందని అటు ప్రతిపక్ష నేతలే కాదు.. పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు పలకల ప్రచారం ప్లాన్ పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడంలేదు.