అమ్మ కేసీఆర్.. శంకుస్థాపనకు రావడానికి అసలు కారణం అదా..!
posted on Oct 20, 2015 @ 6:21PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమానికి నేనే స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానిస్తాని చెప్పడం.. ఆ తరువాత ఆయనే స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించడం.. ఇంటికి వెళ్లిన చంద్రబాబును కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి తాను శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పడం ఇవన్నీ చూస్తుండగానే జరిగిపోయాయి. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత ఇద్దరు చంద్రులు ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడమే సరిపోయింది. అయితే చంద్రబాబు కేసీఆర్ ను పిలవడం వెనుక ఏముందో తెలియదు కాని.. కేసీఆర్ రావడం వెనుక మాత్రం ఓ కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే.. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే కేసీఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి రావడానికి కారణమంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో సీమాంధ్రులు ఎక్కువగా ఉండటం వల్ల.. వారి ఓట్లు కావాలంటే సీమాంధ్రుల మద్దతు కావాలి. మరోవైపు ప్రసుత్తం కేసీఆర్ ప్రభుత్వంపై రైతు ఆత్మహత్యల విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులు ప్రజల దృష్టి మరల్చడానికి వెళుతున్నారని అనుకుంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీదే హవా. ఆ తరువాత దానికి ధీటుగా పార్టీ ఉన్నది మాత్రం టీడీపీకే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వైకాపా పార్టీ.. కాంగ్రెస్ పార్టీల పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఉన్న టీడీపీని ఇరుకున పెట్టి.. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి ఇక్కడ చక్రం తిప్పాలంటే మాత్రం వారి ఓట్లు ఖచ్చితంగా కావాలి. అయితే తెలంగాణ వాదులు, ఎలాగూ కేసీఆర్ కు ఓట్లు దండిగా వేస్తారు. మరి సీమాంధ్రుల పరిస్థితి ఏంటి. అందుకే ఈ రకంగా అయినా వారికి దగ్గర అవుదామనే కారణంతోనే శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్నారని వాదన వినిపిస్తుంది.
ఇదిలా ఉండగా కొంత మంది మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. రాష్ట్రం విడిపోయింది.. మొదట్లో ఇద్దరు గొడవలు పడినా అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. ఏవరి రాష్ట్రం వారిది.. ఎవరి సమస్యలు వారివి. ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఈ పరిస్థితిలో అనవసరమైన గొడవలు ఎందుకులే అని.. లేనిపోని వివాదాల వల్ల వచ్చే ఫలితం ఏముండదని ఆలోచించినట్టు ఉన్నారు అని అనుకుంటున్నారు. మరి అసలు కారణం ఏంటో వారికే తెలియాలి.