నిర్మలమ్మ పద్దులో ఏపీకి వరాలు
posted on Jul 23, 2024 @ 12:26PM
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ఏపీకి సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ప్రకటించిన ఆమె అవసరాన్ని మట్టి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి పూర్తి సహకారం, సహాయం అందిస్తామన్నారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం పూర్తికి అవసరమైన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆహార భద్రత విషయంలో పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైనదని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయంతో పాటు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందజేస్తామన్నారు.
అలాగే వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. వీటితో పాటు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనకబడిన ప్రాంతాలకు నిధులను కేటాయించామని నిర్మలా సీతారామన్ తెలిపారు.