ఆళ్ళగడ్డ పోలింగ్ ఆగదు: ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్
posted on Apr 25, 2014 @ 10:06AM
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీలో వున్న భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆళ్ళగడ్డ ఎన్నిక వాయిదాపడే అవకాశం వుందని అందరూ భావించారు. అయితే ఆళ్ళగడ్డ ఎన్నిక వాయిదాపడదని, యథాతథంగా జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన భన్వర్‌లాల్ ఎన్నికలు ఆపకుండా జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని ప్రకటించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం ఆళ్ళగడ్డలో ఎన్నికలు వాయిదా పడకుండా జరుగుతాయని ఆయన చెప్పారు. సాధారణంగా ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థి మరణిస్తే సదరు నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడతాయి. వైసీపీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన పార్టీయే తప్ప గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడం వల్ల శోభా నాగిరెడ్డి మరణించినప్పటికీ ఎన్నిక వాయిదా పడలేదు.