'నో ఫ్రీ కాలింగ్' అంటున్న కేంద్రం.. ప్రతి నెట్ వర్క్ నిమిషానికి 6పైసలు వసూలు చేయాల్సిందే!
posted on Nov 16, 2019 @ 1:59PM
మొబైల్ ఫోన్ల రంగంలో వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇక పై ఉచిత కాల్స్, చౌక డేటాలు ఉండకపోవచ్చు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికాం కంపెనీలు రూ.92,500 కోట్లకు పైగా చెల్లించాల్సింది ఉంది. దానితో ఇప్పుడు కంపెనీలు మూతపడే ప్రమాదం లేకుండా వాటిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. టెలికాం శాఖలో కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ను ఏర్పాటు చేసి తగిన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఫోన్ కాల్స్ తో పాటు డేటా వినియోగానికి కనీస చార్జీలు వసూలు చేయాలని కమిటీ సూచించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. కస్టమర్ లను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఇస్తున్న ఉచిత ఆఫర్లను వెనక్కి తీసుకోవాలన్న అంశాన్ని కమిటీ ప్రతిపాదించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. టెలికాం కంపెనీల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న ఉచిత కాల్స్ చౌక డేటా ఆఫర్లను ఆపేయాలని కేంద్రానికి కమిటీ నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బెయిలౌట్ ప్యాకేజ్ కింద టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సూచనలు చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిస్ ఫోన్ కాల్స్, డేటా సర్వీసులకు కనీస చార్జీలను కూడా ట్రాయ్ ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. వినియోగదారులు ఉచిత కాల్స్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ సదరు నెట్ వర్క్ లు చార్జీలు.. చెల్లిస్తూనే ఉన్నాయి. ఎయిర్టెల్ నుంచి జియోకు అక్కడి నుంచి మళ్లీ ఎయిర్టెల్ కు కాల్స్ వెళ్లినప్పుడు నిమిషానికి 6 పైసల చొప్పున ప్రత్యర్థి ఆపరేటర్ లకు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల జియో తన వినియోగదారులపై నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని చెప్పి తర్వాత కొత్త స్కీమ్ ల ద్వారా వారికి ఊరట కల్పించింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే వినియోగదారులపై చార్జీల విధింపు ప్రస్తావనను తెరపైకి తెచ్చింది. తాజా ప్రతిపాదనలు ఎయిర్టెల్, వొడాఫోన్ కు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే జియో వేగాన్ని తట్టుకోలేక నష్టాలతో ఉన్న ఇతర కంపెనీలకు టారిఫ్ విధానం ఊరట కలిగించే అవకాశముంది. టెలికాం ప్రతిపాదనలపై వార్తలు వచ్చిందే తడవుగా స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీల షేర్లు 10 శాతం పెరిగాయి.