ధర తక్కువ, టైం ఎక్కువ.. తెలంగాణ బాట పట్టిన ఏపీ మందుబాబులు
posted on Nov 16, 2019 @ 2:48PM
ఏపీలో మందు బాబులు తెలంగాణ బాట పడుతున్నారు. సరిహద్దు గ్రామాల బార్లకు క్యూ కడుతున్నారు. ధర తక్కువ, సమయం ఎక్కువ ఉండటమే కారణం. పొరుగు రాష్ట్ర మద్యంతో ఏపీలో బెల్టు జోరందుకుంటోంది. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరిని కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రర్ల పాడుకు చెందిన ఎంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట కు చెందిన కోపల్లి ప్రకాశరావును అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.తెలంగాణ నుంచి మద్యం రాకుండా కట్టడి చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రలో ధర ఎక్కువ.. రాత్రి 8 గంటలకే దుకాణాలూ మూసేస్తున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ దుకాణాల్లో అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. పశ్చిమ కృష్ణా లో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉండటంతో.. ఇక్కడి ప్రజలు సరిహద్దు ఆవల సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని దుకాణాలకు క్యూ కడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు.. పేదలు.. ఎక్కువగా తాగే బ్రాండ్ లు సీసాకు 40 రూపాయలకు పైగా ధరలో వ్యత్యాసం ఉంది.
వీరులపాడు మండలం పెద్దాపురం, జయంతి, అల్లూరు గూడెం, మాధవరం గ్రామాల మందు బాబులు ఎర్రుపాలెం దుకాణాలకు.. వీరులపాడు, దొడ్డదేవరపాడు, బి అన్నవరం పల్లెంపల్లి, కొనతాలపల్లి, వెల్లంకి గ్రామాల నుంచి దెందుకూరు దుకాణానికి వెళుతున్నారు. వత్సవాయి మండలం కాకిరాయి, కంభంపాడు, మాచినేనిపాలెం, తాళ్లూరు, పెనుగంచిప్రోలు మండలం శివాపురం ముచింతల, అనిగండ్లపాడు.. నందిగామ మండలం, జొన్నల గడ్డ రామిరెడ్డిపల్లి, మధిర శివారులో ఉన్న మడుపల్లి దుకాణానికి బారులు తీరుతున్నారు.
మండల కేంద్రం వత్సవాయిలో రెండు దుకాణాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఐదు కిలోమీటర్ల దూరంలోని బోనకల్లుకు పోతున్నారు. కొంత మంది పొరుగు రాష్ట్రం దుకాణాల నుంచి మద్యం బాటిళ్లు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ విధంగా తీసుకు వచ్చిన 203 బాటిళ్లను శుక్రవారం నందిగామ ఎక్సైజ్ అధికారులు పట్టు కున్నారు. చందర్లపాడుకు చెందిన ఎంపతి మల్లీశ్వరి,పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాష్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13వ తేదీన నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో తనిఖీల్లో భాగంగా 150 సీసాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు రోజుల కాలంలో తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా చేయడం ఇది రెండో సారి.