అఖిల్ పేరుతో అమ్మాయిలతో ఛాటింగ్
posted on Feb 17, 2015 @ 10:42AM
హైదరాబాద్‌లో కూకట్‌పల్లికి చెందిన ఓ అమ్మాయికి ఫేస్‌బుక్ అకౌంట్ వుంది. సరే, ఈరోజుల్లో అందరికీ ఫేస్‌బుక్ అకౌంట్ కామనే అనుకోండి.. ఆ అమ్మాయి ఓరోజు ఫేస్‌బుక్ చూస్తూ వుండగా అక్కినేని అఖిల్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె అబ్బ... అక్కినేని అఖిల్ అనుకుంటూ అతనితో ఛాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అవతలి నుంచి అక్కినేని అఖిల్ కూడా ఆమెతో మస్తుగా ఛాటింగ్ చేస్తున్నాడు. అఖిల్ లాంటి హీరో తనతో ఛాటింగ్ చేయడం తన అదృష్టం అనుకుంటూ ఆ అమ్మాయి కూడా అఖిల్‌తో ముచ్చటిస్తోంది. అయితే అవతలి నుంచి ఛాటింగ్ చేస్తోంది అక్కినేని అఖిల్ కాదు.. అతని పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన అభినవ్ అనే కుర్రాడు. అయితే ఛాటింగ్ చేసే సమయంలో అఖిల్ ఎలాంటి సమాధానాలు చెబుతాడో అలాగే చెప్పేవాడు. తన అకౌంట్లో అక్కినేని వంశం ఫొటోలు పెట్టేవాడు. టోటల్‌గా బిల్డప్ అంతా అక్కినేని అఖిల్ తరహాలోనే వుండేది. ఇలా ఆ ఒక్క అమ్మాయితో మాత్రమే కాకుండా చాలామంది అమ్మాయితో ఛాటింగ్ చేస్తూ వుండేవాడు. చివరికి ఈ అమ్మాయిని డబ్బులు అడగటం మొదలుపెట్టాడు. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలంటూ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. వందల కోట్లకు వారసుడైన అక్కినేని అఖిల్ ఏంటీ... అప్పు అడగటం ఏంటని ఆ అమ్మాయికి డౌటొచ్చింది. వెంటనే ఆమెలోని భారత వీరనారి నిద్రలేచింది. ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పంది. దాంతో అతన్ని ట్రాప్ చేసి పట్టుకుని, ఆ చెంపా ఈ చెంపా వాయించి పోలీసులకు అప్పగించారు. తనలాగా మరెవరూ మోసపోకూడదన్న ఉద్దేశంతోనే అతన్ని పట్టించానని ఆ వీర యువతి చెబుతోంది.