వ్యవసాయ ఋణాలు ఎందుకు రద్దు చేయరు?
posted on Apr 29, 2020 @ 12:47PM
రిజర్వు బ్యాంకు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఋణాలు ఎగవేత దారులకు ఊరట కలిగిస్తూ రూ 68 వేల 607 కోట్ల ఋణాలు రద్దుచేసింది. ఈ చర్యతో లాభపడినవారంతా ప్రముఖ పారిశ్రామిక వేత్తలే.
తమ ఋణాలపై నెలవారి కిస్తీ చెల్లించని వేతన జీవులు, రైతులు, రైతు కూలీల ఆస్తులు జప్తు చేసే బ్యాంకులు ఈ బడా పారిశ్రామిక వేత్తలకు, అందునా ఉద్దేశపూర్వకంగా ఋణాల ఎగవేత దారులను ఎందుకు కరుణించాయో చెప్పాలి. ఋణాలు ఎగ్గొట్టి దేశం వదిలి వెళ్ళిపోయిన వారిని పక్కన పెడితే దేశంలో ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పట్ల బ్యాంకులకు ఇంత ప్రేమ ఎందుకో తెలియదు.
అయినా ఈ వెసులుబాటు వ్యవసాయ ఋణాలకు ఎందుకు ఉండదు? ఉన్నా ఈ స్థాయిలో ఎందుకు ఉండదు? కంటితుడుపు ఋణమాఫీలు మాత్రమే ఎందుకుంటున్నాయి? అది కూడా ప్రభుత్వాలు మాత్రమే అమలు చేస్తున్నాయి కానీ బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదు?
దాదాపు 70 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంలో ఋణాలు కేవలం రూ 11 లక్షల కోట్లు (2019-20 బడ్జెట్) మాత్రమే. ఇందులో పంట ఋణాలు రూ 9 లక్షల కోట్లు. వీటిలో కూడా సాధారణ రైతుకు దక్కేది ఏమీ ఉండదు. కౌలు రైతును బ్యాంకులు తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వవు. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో పధకం పెట్టి ఋణాలు అందజేస్తే మినహా కౌలు రైతుల మొహం చూసే బ్యాంకు ఒక్కటి కూడా లేదు.
దేశంలోని ఏ బ్యాంకు ఆదాయం చూసినా అది ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో వచ్చినదే. ప్రజలనుండి సేకరించిన సొమ్ము ప్రజలకు చెందకుండా ఇలా "ఉద్దేశపూర్వక ఋణ ఎగవేతదారులకు" లబ్ది చేకూర్చడం ఏ ఆర్థికశాస్త్రమో పాలకులే చెప్పాలి.