విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ పై సస్పెన్షన్ వేటు
posted on Sep 24, 2025 @ 1:11PM
విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్( ఏడిఈ) అంబేద్కర్ పై సస్పెన్షన్ వేటు పడింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖలో ఏ డి ఈ గా పని చేస్తున్న అంబేద్కర్ ఇంట్లో కొద్ది రోజుల కిందట ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. అంబేద్కర్ పై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అంబేద్కర్ ఇంటి తోపాటు బినామీ, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగించారు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బాధ్యతలు కొనసాగిస్తూనే మరోవైపు నార్సింగ్ డివిజన్ కూడా ఏ డి ఈ గా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలోనే మణికొండ నార్సింగ్ పరిధిలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతుండగా వాటి అనుమతుల కోసం వచ్చిన వారి వద్ద నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏసీబీ అధికారుల సోదాల్లో అంబేద్కర్ ఇంట్లో భారీ ఎత్తున నగదు తో పాటు బంగారం విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం 500 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా అంబేద్కర్ బినామీ ఇంట్లో రికార్డు స్థాయిలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనది. ఒక వైపు ప్రభుత్వ అధికారిగా ఉంటూనే మరో వైపు ప్రవేటు సంస్థలను స్థాపించిన అంబేడ్కర్ వాటికి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఏసిబి అధికారులు ఇప్పటికే అంబే ర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ ఏడిఈ అంబే ద్కర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.