నటుడు శివాజీ జలదీక్ష
posted on Apr 13, 2015 @ 2:40PM
నటుడు శివాజీ విజయవాడ వద్ద కృష్ణానది నీటిలో సగం మునిగి జలదీక్ష ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆయన ఈ జలదీక్షను ప్రారంభించారు. సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి దిగువన కృష్ణానదిలో ఆయన జలదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించే బాధ్యతను తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే సగం మునిగామనే విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ తాను జలదీక్ష చేస్తున్నానని, ఏపీ ప్రజలను పూర్తిగా ముంచొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. తాను బీజేపీలో లేనని సోము వీర్రాజు అనే బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించడం మీద శివాజీ స్పందిస్తూ.. సోము వీర్రాజు అనే వ్యక్తి అసలు ప్రజలకు తెలుసా అని ప్రశ్నించారు. తాను బీజేపీలో లేనట్టయితే, మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీలో లేనట్టేనని, ఎందుకంటే తామిద్దరం ఒకేసారి పార్టీలో చేరామని శివాజీ చెప్పారు.