కుమారస్వామి కాన్వాయ్ లో ప్రమాదం... జీవీఎల్ వాహనం ధ్వంసం
posted on Jan 30, 2025 @ 12:37PM
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి విశాఖ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. విశాఖ పర్యటన కోసం గురువారం (జనవరి 30) వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామికి విశాఖ విమానాశ్రయంలో ఎంపీలు భరత్, అప్పలనాయుడు, పలువురు కూటమి పార్టీల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం 11 వేల 440 కోట్ల భారీ ప్యాకేజీని విడుదల చేసిన తరువాత కుమారస్వామి విశాఖ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బెయిలౌట్ ప్యాకేజి ప్రకటించిన తరువాత తొలి సారి విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కుమార స్వామికి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది.
విశాఖ విమానాశ్రయం నుంచి కుమార స్వామి నేరుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సందర్శనకు బయలు దేరాలు. అలా వెళుతున్న క్రమంలో ఆయన కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే ఈ ప్రమాదంలో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజేపీ నేత అయిన జీవీఎల్ నరసింహరావు వాహనం దెబ్బతింది. ఈ ఘటనలో మొత్తం మూడు కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అలా ధ్వంసమైన మూడు కార్లలో జీవీఎల్ నరసింహరావు వాహనం కూడా ఉంది.