అభినందన్ నెంబర్ వన్.. ఆయన తర్వాతే సినిమావాళ్లు, క్రికెటర్లు

గూగుల్‌లో ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 ప్రముఖుల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ మొదటి స్థానంలో ఉన్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నంలో పాక్‌కు చెందిన యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. అయితే ఆయన నడుపుతున్న మిగ్ 21 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయింది. ఆ తర్వాత అభినందన్‌ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. దౌత్య ఒత్తిడితో ఆయన్ను మూడు రోజుల తర్వాత భారత్‌కు పాక్ అప్పగించింది. పాక్ బలగాల అదుపులో ఉన్నా.. చెక్కుచెదరని స్థయిర్యంతో భారత రక్షణ రంగ రహస్యాలను ఎక్కడా వెల్లడించకపోవడం అభినందన్ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి. తాజాగా, గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా విడుదల చేయగా, అందులో అభినందన్ కు ప్రథమస్థానం లభించింది. రెండో స్థానంలో లతా మంగేష్కర్, మూడో స్తానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు.
 

Teluguone gnews banner