ఆప్ నుంచి ఎమ్మెల్యే బిన్నీ సస్పెండ్
posted on Jan 27, 2014 @ 10:08AM
ఆమ్ ఆద్మీ పార్టీ తమ రెబెల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించింది. అధినేత కేజ్రీవాల్ పైన తీవ్రవిమర్శలు చేసి క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తనను పార్టీ నుండి బహిష్కరించడంపై బిన్నీ స్పందించారు. ఢిల్లీ సమస్యల పైన తాను మాట్లాడానని, అలాంటప్పుడు వారు తనను పార్టీ నుండి తొలగించడం కంటే మించి ఏమీ చేయలేరని విమర్శించారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పైన బిన్నీ కొద్దిరోజుల క్రితం తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజ్రీవాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హామీల అమలును కేజ్రీవాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.