పోస్టింగ్‌ ఇవ్వకుండానే పంపించే పన్నాగం! ప్రభుత్వమే పగబడితే...

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది.  2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది. ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేసింది జ‌గ‌న్ ప్రభుత్వం. క్యాట్‌ను ఆశ్రయించిన తర్వా త తీర్పు అనుకూలంగా వచ్చింది.  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని జ‌గ‌న్ ప్రభుత్వం ఆయ‌న‌పై ఆరోపించింది. దీంతో ఆయ‌న  రెండు సార్లు సస్పెండ్ కు గురైయ్యారు.  దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మాత్రం ఆయనకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో జీతం కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. 

ఆ తీర్పుకు సంబంధించిన పేపర్లు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆ తీర్పు ప్రతుల్ని అందజేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.. ఈ మేరకు దరఖాస్తును కూడా అందజేశారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ దగ్గర అనుమతి పొందిన తర్వాత ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్‌ను ఎలక్షన్ కమిషన్‌కు పంపాలి. కానీ చీఫ్ సెక్రటరీ,  ఏబీ వెంకటేశ్వర రావు ఫైల్‌ను సీఎం జగన్‌కు పంపించారు. పదవీ విరమణ చేసేవరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడతోనే ఇలా వ్య‌వ‌హ‌రించార‌నే చర్చ ఐపీఎస్‌ వర్గాల్లో నడుస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావుపై, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, ఐదేళ్లూ అక్రమ కేసులతో వేధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది.  

మరోవైపు ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో సీఎస్‌ జవహర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్‌ అడ్మిట్‌ కాలేదు. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు  కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈఓ.. కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తెచ్చారని సమాచారం.  క్యాట్‌ ఆదేశాలు అమలుచేసి ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వడానికి, ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వట్లేదు. 
 
జగన్ సీఎం అయ్యాక.. అనేక మంది అధికారులపై కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఇందు కోసం సవాంగ్ అనే డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఫోర్జరీ కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక్క ఏబీవీ మాత్రమే బయటకు కనిపిస్తున్నారు. ఆయన ఐదేళ్ల సర్వీస్ ను తప్పుడు పద్దతిలో సస్పెన్షన్ పేరు చెప్పి నాశనం చేశారని క్యాట్ చెప్పింది. సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. అయినా పోస్టింగ్ ఇవ్వలేదు.  ఆయన రిటైరయ్యే వరకూ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలని ప్ర‌భుత్వం అనుకుంటోంది. ఇదంతా సీఎస్ కనుసన్నల్లోనే జరుగుతోంది.  

ప్రభుత్వం మారిన త‌రువాత‌.. ఇప్పుడు జ‌గ‌న్ ఆడించిన‌ట్లు ఆడుతున్న అధికారుల ప‌రిస్థితి ఏమిటి? రాజకీయ పార్టీల ట్రాప్ లో పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్నట్లే.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

Teluguone gnews banner