యుగాంతం పుకారే
posted on Dec 22, 2012 @ 2:48PM
నిన్న డిసెంబర్ 21 న ప్రపంచం ముగుస్తుందని జరిగిన ప్రచారాలు వట్టి వదంతులేనని తేలిపోయింది. మాయన్ల కాలెండర్ ప్రకారం ఐదు వేల ఏళ్ల యుగం నిన్నటితో ముగుస్తుంది కాబట్టి ఈ రోజు యుగాంతం జరుగుతుందని అనేక పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోని అనేక కోట్ల మంది ప్రజలను భయపెట్టిన ‘యుగాంతం’ వాస్తవం కాదని తేలిపోయింది. కాలెండర్ ఫై 22 వ తేదీ ప్రత్యక్షం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు నిన్నంతా బిక్కుబిక్కు మంటూ గడిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం, ఎలాగూ ప్రపంచం అంతం అవుతుంది కాబట్టి సరదాగా పార్టీలు చేసుకున్నారు.
ఈ యుగాంతం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటే, నాశనం అనేది ఉండదని ప్రచారం ఉన్న ఫ్రాన్స్ లోని బుగారచ్, టర్కీ లోని సిరిన్స్, సెర్బియా, బ్రెజిల్ లోని కొన్ని ప్రాంతాల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అమెరికా ప్రజలు ఈ కీలక సమయంలో అంత రిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ను నమ్ముకున్నారు.
ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఏమి చేయాలనే విన్నపాలతో నిన్నంతా ‘నాసా’ ఫోన్లు ఫుల్ బిజీ గా ఉండి పోయాయి. భూమి మరో 400 కోట్ల సంవత్సరాల పాటు నిక్షేపం గా ఉంటుందని వారికి ‘నాసా’ శాస్త్రవేత్తలు అభయ హస్తం ఇచ్చారు. ఈ వదంతులను నమ్మవద్దని ‘నాసా’ ప్రజలకు సూచించింది.