Read more!

రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పాత్ర ఏమయినా ఉందా?

 

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన జూన్ 2వ తేదీని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నవ నిర్మాణ దినంగా అదే రోజును రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటించింది. ఆ రోజు నుండి వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూన్ 9వ తేదీన రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా చేస్తున్న కార్యక్రమాలే అయినా, జూన్ 9నాటికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేప్పట్టి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది కనుక ఆరోజు ప్రభుత్వం నిర్వహించబోయే బహిరంగ సభకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది తెదేపా ప్రభుత్వ విజయోత్సవ సభగా నిర్వహించే అవకాశాలే ఎక్కువ.

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దానిని వ్యతిరేకించడమే తన పార్టీ సిద్దాంతంగా మార్చుకొన్న జగన్మోహన్ రెడ్డి జూన్ 5,6 తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దీక్ష చేయాలని నిర్ణయించుకొన్నారు. తెదేపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్నసందర్భంగా ఎంతో అట్టహాసంగా విజయోత్సవ సభను నిర్వహించుకోవాలని భావిస్తుంటే, దానికి పోటీగా మూడు రోజుల ముందే జగన్ దీక్షకు కూర్చోవాలని నిశ్చయించుకోవడం ప్రభుత్వం పట్ల, దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకున్న అక్కసుని ప్రదర్శిస్తున్నట్లుంది తప్ప వేరే ఏ ప్రయోజనమూ కనబడటం లేదు.

 

ఇదివరకు ఆయన అనేక అంశాలను తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కానీ అది ఎంతవరకు అంటే మరో సరికొత్త అంశం దొరికేవరకే. మొన్నటి వరకు రాజధాని భూసేకరణకు వ్యతిరేకిస్తూ పోరాడిన ఆయన ఆ తరువాత పట్టిసీమ ప్రాజెక్టుకి కూల్ గా షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ పట్టిసీమను కూడా పక్కనబెట్టి మళ్ళీ రైతు భరోసా యాత్రలు మొదలుపెట్టారు. ఆయన రైతులకు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ వంకతో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటారు.

 

రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఏమయినా ఉందా? అని ప్రశ్నిస్తే లేదనే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని, ప్రత్యేక హోదా ఇమ్మని ఏదో మొక్కుబడిగా అడగడమే తప్ప వాటి కోసం ఆయన ఎన్నడూ గట్టిగా పోరాడింది లేదు. కనీసం తన పార్టీ నేతలయినా అందుకు అనుమతించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టే ప్రతీ పనిని ప్రశ్నించే జగన్, మోడీ ప్రభుత్వాన్ని మాత్రం ఎన్నడూ ప్రశ్నించరు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా నిలదీయడంలేదని తెదేపాను ప్రశ్నించే ఆయన తను మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. మిగిలిన హామీల విషయంలో కూడా ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకనాడు తెదేపా-బీజేపీలు తెగతెంపులు చేసుకోకపోవా? బీజేపీతో తన పార్టీతో పొత్తులు పెట్టుకోకపోదా? అనే చిన్న ఆశ వలనే కావచ్చును.

 

ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన్న రాష్ట్రాభివృద్ధికి కృషి చేయకూడదనే నియమం ఎక్కడా లేదు కనుక రాష్ట్ర విభజన తరువాత అత్యంత దయనీయమయిన స్థితిలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తన పరపతిని ఉపయోగించి అనేక పరిశ్రమలు రప్పించవచ్చును, లేదా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించవచ్చును. తనకున్న యంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చును. కానీ అటువంటి పనులేవీ ఆయన చేకుండా భరోసా యాత్రలు, దీక్షలు చేయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పోషించిన పాత్ర ఏమిటని వచ్చే ఎన్నికలలో ప్రజలు ప్రశ్నిస్తే దానికి ఆ పార్టీ వద్ద సరయిన సమాధానం ఉంటే పరువాలేదు. లేకపోతే మళ్ళీ నష్టపోయేది వారేనని గుర్తుంచుకోవాలి.