Read more!

హైకోర్టు తీర్పుతో తమిళనాట రాజకీయాలలో అనిశ్చితితి తొలగినట్లే

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు చాలా ఊరటనిచ్చింది. అక్రమాస్తుల కేసులో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్. కుమారస్వామి కొట్టివేశారు. ఆమెపై మోపబడిన అన్ని అభియోగాలను కూడా కొట్టివేశారు. ఈ తీర్పుతో గత 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషిగా బయటపడ్డారు. కనుక ఆమె త్వరలోనే మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేప్పట్టే అవకాశం ఉంది.

 

గతేడాది సెప్టెంబరులో ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసేవరకు వారం రోజుల పాటు ఆమె బెంగళూరులో అగ్రహారం జైలులో గడపవలసి వచ్చింది కూడా. ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆమె ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే అర్హత కూడా కోల్పోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆ కారణంగా తమిళనాడులో ఒకరకమయిన రాజకీయ అనిశ్చితి కూడా ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షమయిన డీ.యం.కె., కాంగ్రెస్, బీజేపీ మరియు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఆయాచితంగా దొరికిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికార ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని చురుకుగా పావులు కదిపాయి. కుష్భూ వంటి కొందరు రాజకీయ నేతలు చకచకా పార్టీలు మారి రాష్ట్ర రాజకీయాలలో జయలలిత స్థానాన్ని భర్తీ చేయాలని కలలు కన్నారు. కానీ వారి ఆశలన్నీ కర్ణాటక హైకోర్టు తీర్పుతో అడియాసలయ్యాయి.

 

కోర్టు తీర్పు ఆమెకు, ఆమె ఏ.ఐ.ఏ.డి.యం.కె. పార్టీకి కూడా వెయ్యేనుగుల బలం కలిగించేదిగా ఉంది. నిర్దోషిగా బయటపడిన జయలలిత రెట్టించిన శక్తి, ఉత్సాహంతో రాష్ట్ర రాజకీయాలను శాశించవచ్చును. ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టగానే ముందుగా తను వారం రోజులు జైలులో ఉన్నప్పుడు చెన్నైలో ఒక స్టార్ హోటల్లో పండగ చేసుకొన్న తన మంత్రులందరికీ ఉద్వాసన పలుకవచ్చును. పనిలోపనిగా మంత్రివర్గ ప్రక్షాళన చేయవచ్చు కూడా. కర్ణాటక హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో తమిళనాట రాజకీయాలలో ఏర్పడిన సందిగ్దత పూర్తిగా తొలగిపోయినట్లేనని చెప్పవచ్చును. ప్రజలలో కూడా ఆమె పట్ల సానుభూతి ఏర్పడుతుంది కనుక ఇకపై ఆమెకు రాష్ట్రంలో తిరుగు ఉండకపోవచ్చును.