పార్టీ ఉనికి కోసం తిప్పలు పడుతున్న వైకాపా
posted on Jun 15, 2013 @ 11:30AM
మారో పది నెలలో ఎన్నికలు వస్తునప్పటికీ, ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే సూచనలు కనిపించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యులలో చాలా ఆందోళన నెలకొంది. అతను జైలు నుండి వ్యవహారాలు ఎంత చక్కబెడుతున్నపటికీ, ఎన్నికలలోగా ఆయన విడుదల కాకపోతే పార్టీ పరిస్థితి తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీలో చేరిన, చేరుతున్న నేతలు పార్టీ పరిస్థితిపై ఏమాత్రం అనుమానం కలిగినా నిస్సంకోచంగా వెంటనే వేరే పార్టీలోకి దూకేయడం ఖాయం. ఇక, ఎన్నికలు దగ్గర పడుతున్నపటికీ జగన్ జైలు లోపలే ఉండిపోవడం వలన ఆ పార్టీ నిర్మాణం కూడా ఇంతవరకు సరిగ్గా జరుగలేదు. ఇది కూడా ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం షర్మిలా, విజయమ్మ ఇద్దరూ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నపటికీ, వారు కూడా సరయిన దిశా నిర్దేశం లేక తమకు తోచిన విధంగా పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారు. అయితే, వారిరువు నిర్మాణాత్మకమయిన దిశలో ముందుకు సాగకపోవడం వలన వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన గంగగా మారుతోంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి చూసినట్లయితే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల సలహా సంప్రదింపులు, సేవలను ఆ పార్టీ ఏవిధంగా కూడా ఉపయోగించుకొంటున్నట్లు కనబడటం లేదు. అందువల్ల, విజయమ్మ ఇతర పార్టీల కార్యక్రమాలను, పద్దతులను అనుకరిస్తూ వైకాపాను నెట్టుకొస్తున్నారు. ఇటువంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ పార్టీ స్వయంకృతాపరాధం వలన కూడా కొత్త సమస్యలు సృష్టించుకొంటోంది.
ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో విజయమ్మ తమ రాజకీయ ప్రత్యర్ధులపై కేవలం మాటల యుద్ధమే కాకుండా అవసరమయితే భౌతిక దాడులు కూడా చేయమని ఆదేశించినట్లు ఆ పార్టీ నేత రాజేష్ కార్యకర్తలతో చెప్పడం రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించాయి. ఇది పార్టీపట్ల ప్రజలలో వ్యతిరేఖతను ఏర్పరుస్తుంది తప్ప పార్టీకి ఏవిధంగాను ఉపయోగపడదని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. జగన్ జైలు నుండి విడుదల కాని పక్షంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీని ఏవిధంగా సన్నధం చేసుకోవాలోనని ఆలోచించవలసిన తరుణంలో ఇటువంటి ఆలోచనలు చేయడం పార్టీకి ఏవిధంగా మేలు చేయకపోగా, పార్టీపై ప్రజలలో దురభిప్రాయం కల్గిస్తాయి. ఇప్పుడే ఆ పార్టీ నేతలు ఇటువంటి ఆలోచనలు చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఏవిధంగా ప్రవరిస్తారనే సందేహం తప్పకుండా ప్రజలలో కలుగుతుంది. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడటానికి ఇటువంటి ఆలోచనలు చేయడం వలన పార్టీకి మేలు జరుగక పోగా కీడు జరగవచ్చును.
సారధి లేకుండా ఎన్నికల కురుక్షేత్రంలోకి కదులుతున్న వైకాపా రధంలో ఆ సమయానికి ఎందరు మిగులుతారో కాలమే చెపుతుంది.