ఎర్రం నాయుడు కుమారుడుకి పెద్ద బాధ్యత ?
posted on Dec 10, 2012 @ 4:00PM
ఇటీవల మృతి చెందిన శ్రీకాకుళం మాజీ ఎం పి ఎర్రం నాయుడు స్థానంలో ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుని వచ్చే ఎన్నికల్లో ఆయన తండ్రి స్థానం నుండి పోటీ చేయించాలని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు నిర్ణయించారు.
అయితే, ఆయన రాజకీయ పరిపక్వత ఫై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. రామ్మోహన్ నాయుడు ఇంత వరకూ రాజకీయాల్లో లేరు. ఆయన వయసు కూడా తక్కువే. అలాంటి వ్యక్తికి ఇంత పెద్ద బాధ్యతా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి నేతను ఏకంగా పార్లమెంట్ కు కాకుండా, ముందుగా అసెంబ్లీకి పోటీ చేయిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఎర్రం నాయుడు కుటుంబంఫై ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోదలిస్తే, మూడు సార్లు ఎల్ఎల్ఏ గా గెలిచిన ఆయన సోదరుడు ఎలాగూ ఉన్నారు. ఆయనను కూడా కాదని రామ్మోహన్ నాయుడుకు బాధ్యతలు అప్పగించడం ఏమిటనే చర్చ జరుగుతోంది.
ఎర్రం నాయుడు వారసుని విషయం లో సస్పెన్స్ తొలగిపోయిందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరో వైపు రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్చార్జ్ గా నియమించడంతో జిల్లాలోని ఇతర సీనియర్ నేతలు కిమిడి కళావెంకటరావు, తమ్మినేని సీతారాం, కావలి ప్రతిభా భారతి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వయసులో చిన్న వాడయిన రామ్మోహన్ నాయుడుకు ఈ బాధ్యత అప్పగించే విషయంలో ఈ నేతలు మొదటి నుండి అందుకు విముఖత చూపిస్తూ వచ్చారు. కళావెంకటరావు అయితే, ఈ నియామకం విషయంలో అప్పుడే తుది నిర్ణయం తీసుకోవద్దని స్వయంగా చంద్ర బాబు ను కూడా కలిసి విన్నవించుకున్నారు.
ఇంత మంది సీనియర్ లు ఉండగా, రాజకీయాల్లో ఓనమాలు కూడా ఇంకా దిద్దని రామ్మోహన్ నాయుడుకు ఈ బాధ్యత అప్పగించడం ఏమిటని పార్టీ వర్గాల్లో చర్చ మొదలయింది. ఇలాంటి నిర్ణయాలు పార్టీ పతనానికి కారణం అవుతాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని పార్టీ వర్గాల్లో చర్చ మొదలయింది.