కాబోయే ప్రధాని చిదంబరం ?
posted on Dec 11, 2012 8:54AM
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి ప్రస్తుత ఆర్ధిక మంత్రి పి. చిదంబరం తన ప్రయత్నాలను తాను చేస్తున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాన్నే ఇస్తోంది లండన్ కు చెందిన ‘ద ఎకనామిస్ట్’ పత్రిక కధనం. కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేపిన ఈ కధనం వివరాల్లోకి వెళ్తే............
వచ్చే ఎన్నికల నాటికి మన్మోహన్ సింగ్ కు 80 సంవత్సరాలు నిండుతాయని, ప్రధాని పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీకి తగిన అనుభవం రాలేదని, ఈ పరిస్థితిలో ప్రధాని పదవి చేపట్టే అర్హత పార్టీలో కేవలం చిదంబరంకు మాత్రమే ఉందనేది ఆ కధనం సారాంశం. పార్టీలో తన చిరకాల ప్రత్యర్ధి ప్రణబ్ ముఖర్జీ రాష్త్రపతి భవన్ కు వెళ్ళడంతో ఇక చిదంబరంకు ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు మెరుగయ్యాయనేది ‘ద ఎకనామిస్ట్’ కధనం సారాంశం.
వచ్చే ఎన్నికల్లో బిజెపి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దించితే, ఆయనను ఎదుర్కొనే సత్తా రాహుల్ కు లేదని, ఆ సత్తా చిదంబరం కు మాత్రమే ఉందని ఈ పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘ఎఫ్ డి ఐ లఫై పార్లమెంట్లో పార్టీని గట్టేన్కించడానికి చిదంబరం బలంగా ప్రయత్నం చేశారు. సోనియా విశ్వసిస్తే, చిదంబరం ప్రధాని పదవికి తగిన వాడు’ అని ఈ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది.
ఈ కధనం ప్రచురణ వెనుక చిదంబరం హస్తం ఉందని, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్ధి అని పార్టీ నేతలు అహ్మద్ పటేల్, షిండే వంటి నేతలు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఈ పత్రిక కధనం కాంగ్రెస్ పార్టీలో అయోమయానికి కారణంగా నిలిచిన్దనేది కాదనలేని వాస్తవం.