ఎస్సార్సీ వాదనను తెరపైకి తెచ్చిన కిరణ్ ?
posted on Dec 24, 2012 @ 11:04AM
తెలంగాణా విషయంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం వద్ద రెండవ ఎస్సార్సీ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణా ఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, ఆ సమావేశంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కిరణ్ ఈ కొత్త వాదన ఢిల్లీ లో పార్టీ నేతల వద్ద తెచ్చినట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం కిరణ్ ఢిల్లీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. రెండో ఎస్సార్సీ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుతుందని పార్టీ నేతలకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీకి, తెలంగాణా వాదానికీ ఎలాంటి ముప్పు రాదనీ కూడా కిరణ్ వారి వద్ద అన్నట్లు సమాచారం. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలంటే, అది ఎస్సార్సీ వల్లే జరగాలని ఓ దశాబ్ద కాలం క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని కూడా కిరణ్ వారికి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. రెండో ఎస్సార్సీ కి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తే సరిపోతుందని కిరణ్ అన్నట్లు సమాచారం.
దీని వల్ల టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ లకు తప్ప ఇతర ఏ పార్టీకి పెద్ద అభ్యంతరం ఉండదని కిరణ్ అన్నారని తెలుస్తోంది. టిఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని, అయితే, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చక్కబడుతుందని కూడా తన అభిప్రాయంగా కిరణ్ పార్టీ అధిష్టానికి చెప్పినట్లు సమాచారం. దీనితో, ఈ నెల అఖిల పక్ష సమావేశానికి ముందే కిరణ్, బొత్స లతో మరో సారి సోనియా గాంధీ సమావేశం జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.